Father sold his son: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రి కన్న కొడుకును విక్రయించిన ఘటన కలచివేసింది. వినుకొండకు చెందిన వసంతారావు, కొండమ్మలకు ఇద్దరు సంతానం.. వారు కూలి పనుల కోసం ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి ఏడాది క్రితం వచ్చారు. ఈ నెల 16న పనికి వెళ్లి వచ్చాక.. తండ్రి వసంతారావు 14 నెలల వయసున్న చిన్నారిని ఎత్తుకుని బయట తిప్పుతూ బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడు. తిరిగి నిన్న ఇంటికి చేరుకున్నాడు. బిడ్డ ఎక్కడ అని భార్య అడగడంతో 40 వేలకు విక్రయించానని చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బిడ్డను ఎవరికి విక్రయించాడో కూడా అతనికి గుర్తు లేని స్థితిలో మద్యం సేవించాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు.. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు జాతీయ రహదారిపై నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు. హైదరాబాదు నుంచి తిరుపతి వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు కాలు విరిగింది. మరో 9 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అంబులెన్సులు సంఘటన స్థలం చేరుకుని క్షతగాత్రులకు వైద్య సహాయం అందించారు. ప్రమాద సమాచారం తెలియగానే స్థానికులు సంఘటనా స్థలం చేరుకొని గాయపడిన వారిని బస్సులో నుంచి బయటకు తీసేందుకు సహకరించారు.
నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి.. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలోని శారద నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. నాగులపల్లి గ్రామానికి చెందిన కర్రి సంపత్ (16), పొలమరశెట్టి భాను కుమార్ (16)ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశారు. ఇంటి నుంచి సైకిల్‌పై బయలుదేరి శారదా నది వద్దకు వెళ్లారు. ఈత కొట్టడానికి శరదా నదిలోకి దిగిన విద్యార్థులు గల్లంతై మృతి చెందారు.మృతదేహాలను వెలికి తీసి నాగులాపల్లికి తరలించారు. కంటి ముందే కన్నబిడ్డలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురుని కలచి వేసింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదాన్ని నింపింది.
నాలుగు ఇళ్లలో చోరీ.. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని కౌలూరు గ్రామంలో నాలుగు ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. బుధవారం తెల్లవారుజామున దొంగలు ఇళ్లలోకి చొరబడి ఏనిమిది తులాల బంగారం.. 20 తులాల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఇళ్లకు తాళం వేసి మిద్దెపై నిద్రిస్తున్న సమయంలో నాలుగు ఇళ్లలో దొంగలు చొరబడి బీరువాలను ధ్వంసంచేసి చోరీకి పాల్పడ్డారు. మరో ఇంట్లో చోరీ కోసం ఇంటి తాళాలు పాగలకొడుతుండగా శబ్దం రావడంతో స్థానికులు గుర్తించి దొంగలను పట్టుకోడానికి ప్రయత్నించగా పారిపోయారు. విషయం తెలుసుకున్న పాణ్యం ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు నంద్యాల నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు ఇతర వివరాలను సేకరించారు. గ్రామానికి చెందిన జ్యోతి, ఎల్లమ్మ, నరసమ్మ, మద్దిలేటి ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నెల్లూరులో ఆర్టీసీ బస్సులో తప్పిన అగ్ని ప్రమాదం.. నెల్లూరు బాలాజీ నగర్ ఎస్సై సుమన్ అప్రమత్తతో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం తప్పింది. చిల్డ్రన్స్ పార్క్ వద్ద వేకువ జామున ఆర్టీసీ గరుడ బస్సులో మంటలు వచ్చాయి. నిన్న రాత్రి ఎస్సై సుమన్ నైట్ బీట్‌లో తిరుగుతున్నారు. అదే సమయంలో మంటలు అంటుకుని వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సును గుర్తించారు. బస్సును ఓవర్ టేక్ చేసి అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను పోలీసులు సురక్షితంగా బయటికి దించారు. ఎస్సై సుమన్ రాత్రి గస్తీతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: