FAREMERS ON SC VERDICT: న్యాయస్థానంలో అమరావతి కేసుల విచారణలను వచ్చాయంటే చాలు.. రైతుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన కోర్టు ముందు ఉంచుతుందోనన్న ఆందోళన, న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ వారిని వెంటాడుతుంది. ప్రస్తుతం అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో వారి ఆందోళన మరింత రెట్టింపు అయ్యింది.
CRDA చట్టం రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుని అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిందని తెలియగానే రాజధాని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఇక్కడి నిర్మాణాలు పూర్తి చేయటానికి విధించిన కాలపరిమితిపై మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. భూసమీకరణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటం, రైతుల ప్రయోజనాలకు నష్టం చేయవద్దని సుప్రీం చెప్పటాన్ని వారు స్వాగతించారు.
న్యాయస్థానాలపై తమ నమ్మకం మరోసారి రుజువైందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం రాజధాని నిర్మిస్తామంటే తాము భూములిచ్చామని....కానీ ఇప్పుడు ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన విరమించుకుని.. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: