రాజధాని రైతుల పోరు 35వ రోజుకు చేరింది. అమరావతి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నదాతలు... ప్రభుత్వం మూడు రాజధానులు విషయంలో ముందుకు వెళ్తున్నప్పటికీ తమ పోరు ఆపకూడదని... మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో నేడు బంద్ పాటించేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ నిర్వహణ దృష్ట్యా పోలీసు ఆంక్షలు పెరిగినా తమ నిరసన కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రైతులపై లాఠీఛార్జి చేసిన పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించారు. మంచినీళ్లు సహా దుకాణాల్లో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయించకుండా ఉండాలని రైతులు నిర్ణయానికొచ్చారు.
ఇనుప కంచెలు దాటి
పెద్దఎత్తున పోలీసులను మోహరించినా.. ఇనుప కంచెలు, బారికేడ్లతో ఆంక్షలు విధించినా... అమరావతి రైతన్నలు తమ ఆకాంక్షను చాటారు. అసెంబ్లీ ముట్టడికి నలు వైపులా నుంచి చీమల దండులా పోటెత్తారు. పోలీసుల లాఠీ దెబ్బలను, దౌర్జన్యాలను ఎదురొడ్డి.. అమరావతి కోసం నినదించారు. పంట పొలాల్లో, మట్టి గుట్టల్లో, కంప చెట్లలో నడుస్తూ అసెంబ్లీ, సచివాలయ సముదాయం వద్దకు చేరుకున్నారు. వేలాది మంది రైతులు దూసుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బలవంతంగా వెనక్కు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతుల పై లాఠీలతో విరుచుకుపడ్డారు. చిన్నా, పెద్దా.. ఆడా, మగా తేడా లేకుండా వెంటపడి లాఠీలతో బాదారు. దీంతో తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో రాజధానిలో భూగర్భ డ్రైనేజీ కోసం తవ్విన గుంటల్లో కొందరు పడిపోయారు.
రైతులు ఇవాళ మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో35వరోజు రిలేనిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ఉద్ధండరాయిని పాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు నిర్వహించి నిరసనలు తెలపనున్నారు.
ఇదీ చదవండి:పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం