YSR Free Crop Insurance : 2021 ఖరీఫ్ పంట నష్టానికి సంబంధించి YSR ఉచిత పంటల బీమా కింద 15.60 లక్షల మందికి ఈ ఏడాది జూన్ 14న సీఎం జగన్.. 2వేల977కోట్ల 82లక్షల రూపాయలను పరిహారంగా విడుదల చేశారు. అయితే.. పంట నష్టపోయినా జాబితాలో పేర్లు లేవని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే గ్రామంలో పక్కపక్క పొలాల్లో ఉన్న వారిలోనే.. ఒకరికి పరిహారం వస్తే మరొకరికి రాలేదని వాపోయారు.
సీఎం పరిహారం విడుదల చేసిన రోజునే YSR, అన్నమయ్య, ప్రకాశం,గుంటూరు, అనంతపురం, సత్యసాయి తదితర జిల్లాల్లో రైతులు RBKలకు తాళాలు వేసి, నిరసన తెలిపారు. అయితే పంట బీమా రాని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని రైతు భరోసా కేంద్రాల్లో పెట్టిన పంటల బీమా జాబితాల్లో...... అర్హుల పేర్లు లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. వాళ్లకూ పరిహారం వచ్చేలా చూస్తామని పంట బీమా పరిహారం విడుదల సందర్భంగా ప్రకటించారు.
సీఎం సూచనతో పరిహారం రాని రైతులు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. 2021 ఖరీఫ్ నష్టానికి.. ఈ ఏడాది జూన్ 14న విడుదల చేసిందే తుది జాబితాగా ప్రభుత్వం పేర్కొంటోంది. కొత్తగా ఎన్ని అర్జీలు వచ్చాయి? వారికి పరిహారంగా ఎంత చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు తేల్చకుండానే మొత్తంగా పక్కన పెట్టేసింది. ఈ చర్యతో..పంటల బీమా పరిహారం దక్కుతుందనే ఆశతో ఉన్న రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముందే చెబితే రైతు భరోసా కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరిగి దరఖాస్తు చేసేవాళ్లం కాదని మండిపడుతున్నారు.
మరోవైపు.. జూన్ 14 పరిహారం విడుదలచేసిన 15లక్షల 60వేల మంది రైతుల్లో కొందరికి ఇప్పటికీ పరిహారం అందలేదు. అలాంటి వారిని అనుమానిత ఖాతాల కింద ప్రభుత్వం చేర్చింది. వారికి పరిహారం నిలిపేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16వేల మందికి 60కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా. రైతులు రోజూ వ్యవసాయ అధికారులను సంప్రదిస్తున్నా త్వరలో వచ్చేస్తాయనడం తప్పితే సొమ్ము జమకావడం లేదు. ఈ-క్రాప్ నమోదులో తేడాలు గుర్తించి వారికి పరిహారం చెల్లింపు ఆపేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక 2020-21, 2021-22 సంవత్సరాల్లో ఖరీఫ్ పంట కాలానికి బీమా మంజూరు చేసిన ప్రభుత్వం.. రబీ నష్టానికి పైసా విదల్చలేదు. ఇస్తారో, లేదో కూడా తేల్చడం లేదు.
ఇవీ చదవండి: