Bengal Gram Farmers Problem : ఆంధ్రప్రదేశ్‌లో రబీ సీజన్లో రైతులు ఎక్కువగా సాగుచేసే పంటల్లో శనగ ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 4.5 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. శనగ నూర్పిడి పనులు వారం, పది రోజుల నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చితో నష్టపోయిన రైతులు కనీసం శనగ ఆదుకుంటుందని ఎదురు చూసినా.. ధర లేక దిగాలు చెందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఎక్కువగా శనగ పంట సాగవుతుంది. నవంబరులో వర్షాలు పడటంతో పంట దెబ్బతింది.
ఎకరానికి ఐదు నుంచి 7 క్వింటాళ్లు వరకు దిగుబడి చేతికొచ్చింది. వ్యాపారులు క్వింటాకు రూ.4,400లకు అడుగుతున్నారు. పంట నూర్పిడిలు పూర్తయితే ధర మరింత పడిపోయే ప్రమాదముంది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినవారు వాటిని తీర్చుకునేందుకు ఏదో ఒక ధరకు అమ్మేస్తున్నారు. మిగతా రైతులు మాత్రం శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు. శనగ సాగుకు ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులు అదనంగా రూ.15 వేలు వెచ్చించారు. ఇప్పుడున్న ధరకు అమ్మితే కనీస పెట్టుబడి కూడా రాదు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి దాటిన రైతులు మాత్రం ఖర్చుల నుంచి బయటపడతారు. పంట మధ్యలో ఉన్న సమయంలో సోకిన ఎండు తెగులు దిగుబడిపై ప్రభావం చూపింది. లేకపోతే ఎకరాకు సరాసరి 11 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. మార్కెట్ యార్డు ద్వారా ప్రభుత్వం శనగ పంట కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అప్పుడు మద్ధతు ధర క్వింటాకు రూ.5,330లకు తగ్గకుంటే న్యాయం జరుగుతుందని అంటున్నారు.
ప్రస్తుతం దిగజారుతున్న ధరలు, దిగుబడులు చూచి శనగ రైతులు లబోదిబోమంటున్నారు. చాలామందికి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఖరీఫ్‌లో వేసిన మిర్చికి నల్లతామర, ఎర్రనల్లి కారణంగా దిగుబడులు తగ్గాయి. ఆ తర్వాత వేసిన శనగకు కూడా తెగుళ్లు ఆశించటంతో రైతులకు కష్టాలు తప్పలేదు. సొంత పొలం ఉన్న రైతులైతే అరకొర లాభాలతో బయటపడతారు. కౌలు రైతులైతే నిండా మునిగే పరిస్థితి. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతుల నుంచి మద్ధతు ధరకు శనగపంట కొనుగోలు చేస్తే నష్టపోకుండా, అప్పులపాలు కాకుండా బయటపడే అవకాశముంది. కొనుగోలు కేంద్రాల్లో కూడా ప్రతిరైతు నుంచి శనగలు కొనాలని వారు కోరుతున్నారు. అక్కడ రాజకీయ రంగు పులిమి పక్షపాత చూపిస్తే రైతులు మరింత ఇబ్బందులు పడతారని చెబుతున్నారు.
రైతులు శీతల గోదాముల్లో పంట నిల్వ చేయటానికి అద్దె రూపంలో క్వింటాకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అక్కడకు తరలించేందుకు రవాణా ఛార్జీలు, ఎత్తటానికి, దించటానికి కూలీల ఖర్చు ఇవన్నీ కూడా రైతులకు అదనపు భారంగా మారాయి. కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు ప్రారంభిస్తే ఈ మేరకు ఖర్చులు ఆదా కావటంతో పాటు రైతులకు మేలు జరుగుతుంది.
ఇవీ చదవండి