Farmers are farming with diesel engines: గుంటూరు జిల్లాలో పంటలకు సాగునీరు అందించే కాలువల్లో గుంటూరు వాహిని ఒకటి. ఈ కాలువకి వట్టి చెరుకూరు, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని చివరి ఆయకట్టు భూములున్నాయి. అయితే అధికారుల ప్రణాళికా లోపం ప్రతిఏటా రైతులకు శాపంగా మారుతోంది. మిర్చి, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో పంటలను కాపాడుకోవటం కోసం రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వేసవి రావటంతో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏమాత్రం తడి లేకున్నా పంటలు ఎండిపోవటం ఖాయం.
ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న పంటలు కోత దశలో ఉన్నాయి. అందుకే నీటి తడుల ద్వారా పంటలను రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. డీజిల్ ఇంజిన్ల సాయంతో సాగు చేస్తున్నారు, కుంటల్లోని నీరు, మురుగునీటి కాలువలలోని నీటిని తోడి పంటలను తడుపుతున్నారు. దీని కోసం రెండు కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేస్తున్నారు. వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో చాలాచోట్ల ఇలాంటి పైపులైన్లు రోడ్ల వెంట కనిపిస్తున్నాయి. మిర్చి పంట మరో ఒకటి రెండు కోతలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మిర్చి ధర ఆశాజనకంగా ఉండటం రైతులను ఊరిస్తోంది. పంట ఎండిపోకుండా కాపాడుకుంటే నాలుగు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే శ్రమపడుతున్నట్లు రైతులు తెలిపారు.
మొక్కజొన్న కూడా మరికొద్ది రోజుల్లో కోతకు వస్తుంది. అందుకే రెండు, మూడు విడతల్లో నీటిని తోడి పోస్తూ తరలిస్తున్నారు. ప్రతి రెండు వేల అడుగులకు ఓ ఇంజిన్ ఏర్పాటు చేసి.. పైపుల ద్వారా నీటిని పంటపొలాలకు సరఫరా చేసుకుంటున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న కాలువల నుంచి నీటి తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. కాలువల్లో నీరు చాలా తక్కువగా వస్తోంది. ఆ వస్తున్న నీటినే జాగ్రత్తగా పైపుల ద్వారా పంటలకు పెడుతున్నారు. డీజిల్ ఇంజిన్ల వినియోగం వల్ల రైతులకు అదనపు ఖర్చులు తప్పటం లేదు.
గంటకు ఒకటిన్నర లీటర్ డీజిల్ అవసరమవుతుంది. మూడు ఇంజిన్లు పనిచేయాలంటే రోజూ రూ 5 నుంచి 10 వేలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. కాలువలు ఎప్పటికప్పుడు బాగు చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని.. నీరు చివరి ఆయకట్టుకు చేరేదని రైతులు అంటున్నారు. నీటి తడులు పెట్టాల్సిన సమయంలో రైతులు రోజంతా పంట పొలాల వెంట ఉండాల్సి వస్తోంది. నీరు తోడే ప్రాంతం నుంచి పంట పొలం వరకూ పర్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. నీరు పొలంలోకి సజావుగా పారకపోతే ఇంత కష్టం పడి వృథా అవుతుంది. అందుకే వేరే పనులు మానుకునైనా నీటిపారకం సరిగా ఉందా లేదా అని చూసుకుంటున్నారు.
ఇవీ చదవండి: