‘నవంబరు 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు చెన్నాయపాలెం తండాలోని మా ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. బావా బావా అని మా భాషలో పిలిస్తే లేచా. కార్లోకి లాక్కెళ్లి తలుపులేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టడానికి తీసుకెళ్తున్నామన్నారు. కారు స్టేషన్ దాటి ముందుకెళ్తుంటే అనుమానం వచ్చి అడిగా. ఏందిరా నీకు చెప్పేది అని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. బ్రాహ్మణపల్లి రహదారిపై మరికొన్ని కార్లు జత కలిశాయి. నలుగురైదుగురు దిగుతూ, మరికొందరు కార్లోకి ఎక్కుతూ మాచర్ల వెళ్లేదాకా కొట్టారు. నా దవడ పన్ను ఊడిపోయింది. నోటి నుంచి రక్తం కారుతున్నా జాలి చూపలేదు. మాచర్ల దాటాక కాల్వ దగ్గర ఆపారు. అప్పటిదాకా మా పక్కనే ఎస్సై ఉన్నారని తెలియదు. వాళ్లు ఆయనతో నాయక్‌ను మాకు అప్పజెప్పండి.. చంపేసి మూటగట్టి కాల్వలో పడేస్తామని అన్నారు. ఆయన అంగీకరించకుండా నన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మా కుటుంబ సభ్యులకూ నన్ను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియలేదు.
మాచవరం ఎస్సైను అడిగినా చెప్పలేదు. మా అబ్బాయి 100 నంబరుకు ఫోన్ చేసి.. మా నాన్నను తెల్లవారుజామున కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. అక్కడి సిబ్బంది మాచవరం పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసినా తీయలేదట. వారి సూచన మేరకు మా అబ్బాయి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అప్పుడు నాగార్జునసాగర్‌కు పొమ్మన్నారు. సరస్వతి సిమెంటు పరిశ్రమ కోసం సేకరించి నిరుపయోగంగా ఉన్న భూములను గతంలో సాగు చేసుకున్నాం. అప్పుడు రౌడీలు వచ్చి ట్రాక్టర్లతో మేం సాగు చేసిన పొలం దున్నేస్తుంటే.. మీడియాతో మాట్లాడాం. తర్వాత మరోసారి ఎంపీడీవో కార్యాలయంలోనూ మాట్లాడా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నాపై కక్షగట్టారు. నెల కిందట నన్ను వైకాపాలోకి రమ్మన్నారు. మీకు, మీ ముగ్గురు పిల్లలకు ఇల్లు కట్టిస్తాం.. అప్పు తీరుస్తామన్నారు. మేం రాబోమని చెప్పాం. రాజకీయ ఒత్తిళ్లతో నిన్ను కొట్టాల్సి వచ్చింది. నీ మీద చిన్న సారాయి కేసు పెడతామని పెట్టారు. బెయిల్ తీసుకుని బయటకొచ్చా. నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ ఇప్పించండి’ -బాణావత్ యలమంద
భయం భయంగా ఉంది
మా ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే.. అడ్డం వస్తే.. కాల్వలో వేసి తొక్కిస్తామన్నారని నాయక్ భార్య శౌరీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొంతమంది వైకాపా పెద్దోళ్లు పిలిచి.. మీ ఆయనకు తెలియకుండా డబ్బులు తీసుకో. నాయక్‌కు నచ్చజెప్పి ఆ పార్టీలోకి రమ్మన్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ.. తెదేపాను వదిలేది లేదని చెప్పా. నా చిన్న కుమారుడు ప్రసన్న కుమార్ నాయక్ ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఇది తీసుకెళ్లి ఏవైనా మీటింగులు పెట్టి రచ్చ చేస్తే నాలుగు సార్లు కిడ్నాప్ చేసి ఇలాగే చేస్తాం అని ఎస్సై భయపెట్టారు. భయం భయంగా ఉంది’- నాయక్ భార్య శౌరీబాయి
ఎమ్మెల్యేనే కిడ్నాప్ చేయించారు..
జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అరాచకం ప్రబలుతోందనడానికి యలమంద నాయక్ కుటుంబంపై జరిగిన దాడే ఉదాహరణ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ‘ఇంట్లో నిద్రిస్తున్న యలమంద నాయక్‌ను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రౌడీలతో కిడ్నాప్ చేయించారు. కార్లు మార్చుకుంటూ.. నాయక్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. రౌడీలు, ఎమ్మెల్యేపై కేసు పెట్టాల్సిన ఎస్సై.. వారికే దండం పెట్టి ఉద్యోగం కాపాడమని వేడుకుంటున్నారు. దీనికి డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’- వర్ల రామయ్య
యలమందను కొట్టాననడం అవాస్తవం
యలమంద నాయక్‌ను కొట్టాననడం అవాస్తవమని విజయపురిసౌత్ ఎస్సై పాల్ రవీందర్ చెప్పారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలేనికి చెందిన యలమంద ఈ నెల 2న తెలంగాణ నుంచి రూ.7.500 విలువైన మద్యం సీసాలను రాష్ట్రంలోకి తీసుకొస్తుండగా సాగర్‌లోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.- ఎస్సై
ఇదీ చదవండి: నకిలీ వార్తల నియంత్రణకు కేంద్రం మరో ముందడుగు