హైదరాబాద్‌లోని వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు.
హైదరాబాద్‌లోని ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రదీప్(33).. స్థానిక సంతోషిమాత కాలనీలో ఉంటున్నాడు. శనివారం రాత్రి భార్య స్వాతి(29), ఇద్దరు పిల్లలు కల్యాణ్ కృష్ణ(6), జయకృష్ణ(2)కు ఆహారంలో విషం కలిపి ఇచ్చాడు.
భార్య, పిల్లలు చనిపోయిన అనంతరం రోజంతా వారి శవాల వద్దే ఉన్న ప్రదీప్.. ఆ తర్వాత తాను విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతురాలు స్వాతి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి. స్వాతి ఎంఎస్‌సీ గోల్డ్ మెడలిస్ట్ అని బంధువులు చెబుతున్నారు.
శనివారం నుంచి వారు ఇంటి నుంచి బయటకు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఫోన్ చేసినప్పటికీ ఎంతకీ స్పందించకపోవడం వల్ల.. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించగా.. నలుగురు విగతజీవులుగా కనిపించారు.
మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం హస్తినాపురంలోని సంతోషిమాత కాలనీలో వీరు ఇల్లు నిర్మించుకున్నారు.
ఇవీ చూడండి:మూడో తరగతి బాలికపై అత్యాచారయత్నం