లాక్‌డౌన్ వేళ అంతా ఉపాధి కోల్పోయి అల్లాడుతుంటే గుంటూరులోని ఓ కుటుంబం మాత్రం సువర్ణావకాశాన్ని సృష్టించుకొంది. ఏదో ఒక ఆదాయ మార్గం కోసం అన్వేషించిన పట్టాభిపురంలోని షెహనాజ్ కుటుంబం.. వినూత్నమైన ఆలోచన చేసింది. చాక్లెట్లతో పుష్పగుచ్ఛాల తయారీ ప్రారంభించింది. శుభాకాంక్షలు తెలిపే సందర్భం దాటిపోగానే వాడిపోయే పుష్పగుచ్ఛాల బదులు... పిల్లాపెద్దా అంతా దాచుకొని మరీ ఆస్వాదించే చాక్లెట్ పుష్పగుచ్ఛాలు తయారు చేశారు.
చాకో బొకేల తయారీకి ముందుగా ముడిసరుకు తెచ్చుకొని ఇంట్లోనే వివిధ ఆకృతుల్లో చాక్లెట్లు తయారు చేశారు. ప్లాస్టిక్ లేదా వస్త్రంతో తయారు చేసిన అందమైన కృత్రిమ పూలనూ సిద్ధం చేసుకున్నారు. సృజనకు పదునుపెట్టి వాటిని చూడచక్కగా మేళవించారు. పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయటం సహా ప్యాకింగ్ అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శుభాకాంక్షలు తెలపగానే ఆశ్చర్యపోయేలా తీయనైన పుష్పగుచ్ఛాలను ఆవిష్కరించారు. మొదట్లో బంధుమిత్రులే చాకో బొకేలు కొనుగోలు చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలూ కలిసొచ్చిన వేళ ఇతరుల నుంచి సైతం ఆర్డర్లు పెరిగాయని షెహనాజ్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇదీచదవండి.