సివిల్ సప్లయిస్, ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, మున్సిపల్, లీగల్ మెటరాలజీ అధికారులు... గుంటూరు జిల్లాలోని వ్యాపార సంస్థలపై పలుచోట్ల తనిఖీలు చేశారు. నగరంలో పలు రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పాడైన మాంసాన్ని విక్రయిస్తున్న బార్కాస్, శ్రీ ఆంజనేయ రెస్టారెంట్లను సీజ్ చేసి.. కేసులు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల,మున్సిపాలిటీ స్థాయిలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు కొనసాగుతున్నాయని వివేక్ యాదవ్ తెలిపారు. కల్తీకి పాల్పడిన వ్యాపార సంస్థలను సీజ్ చేయటంతో పాటు ఆహార భద్రత చట్టం, తూనికల కొలతల శాఖ యాక్ట్, సివిల్ సప్లయిస్ యాక్ట్, ట్రేడ్ లైసెన్స్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. విక్రయాల్లో అవినీతికి పాల్పడుతున్నవారి సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1902 కి ఫోన్ చేసి తెలిపితే.. వెంటనే దాడులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని పలు తినుబండార, శీతలపానీయాల దుకాణాలపై మండల టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత స్వీట్స్ దుకాణంపై దాడులు చేయగా.. స్వీట్స్ తయారీ విధానంలో ఎక్కువ మొత్తంలో రంగులు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దుకాణానికి సంబంధించిన ధృవ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించనందున దుకాణుదారుడికి.. హెచ్చరికలు జారీ చేశారు. వ్యాపారులు ఇలాంటి విధానాలు మార్చుకోవాలని తాహసీల్దార్ కె.రవిబాబు సూచించారు. మరోసారి పట్టుబడితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:
ఉయ్యందనలో వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందని తెదేపా నేతల ఆందోళన