Explosive material: హైదరాబాద్ ఆటోనగర్‌లోని గోదాములో నిర్వహించిన తనిఖీలలో.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నుంచి రవాణా అయిన పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. పట్టుబడిన సరకు చిలకలూరిపేటలోని నవత ట్రాన్స్‌పోర్టు నుంచి వచ్చినట్లు తేలింది. ఎనిమిది సంచుల్లో 130 కిలోల పేలుడు పదార్థాలు మహారాష్ట్రలోని ఫుణెకు గిఫ్ట్ ప్యాక్‌ల పేరుతో రవాణా అవుతున్నట్లు గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన ఓ ట్రేడింగ్ కంపెనీ.. మార్చి 14న చిలకలూరిపేట నుంచి 8 సంచులను మహారాష్ట్రలోని పుణెకి రవాణా నిమిత్తం నవత ట్రాన్స్‌పోర్టులో వేశారు. ఆ సంచులు గురువారం హైదరాబాద్‌లోని ఆటోనగర్ ట్రాన్స్‌పోర్టు గోదాముకు చేరుకున్నాయి. సాధారణ తనిఖీలు చేపడుతుండగా సంచుల్లో బాణసంచా పదార్థాలు కనిపించాయి. సాధారణ ఉష్ణోగ్రతలో వీటిని ఉంచితే పేలే అవకాశాలు ఉండటంతో ట్రాన్స్‌పోర్టు యాజమాన్యం వాటిని సురక్షితంగా పెట్టారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మొత్తం 8 సంచుల్లో 130 కిలోల బరువుతో 95 బాణసంచా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ మేనేజరు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేలుడు పదార్థాలు అని చెప్పకుండా.. గిఫ్టులని చెప్పి వాటిని రవాణా కోసం ఇచ్చినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేటలో విచారణ..
హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో చిలకలూరిపేట రూరల్, అర్బన్ సీఐలు ఎం.సుబ్బారావు, రాజేశ్వరరావు విచారణ చేశారు. స్థానిక నవత ట్రాన్స్‌పోర్టు ఏజెంటు శ్రీకాంత్‌ను అర్బన్ సీఐ విచారించారు. ఈ నెల 14న పాలిథిన్ సంచుల్లో బాషా అనే వ్యక్తి వీటిని తెచ్చి గిఫ్ట్ ప్యాకెట్లు పంపిస్తున్నట్లు, వాటిని కేవీఆర్ ట్రేడింగ్ కంపెనీలో కొన్నట్లు నమోదు చేశారని, అవి బాణాసంచా అని తెలియక తాము వాటిని ఫుణెకు పంపినట్లు అతను తెలిపాడు. స్థానికంగా కేవీఆర్ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులను చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై సుబ్బారావు విచారించారు. ఈ నెల 14న నెల్లూరుకు చెందిన బాష అనే వ్యక్తి తమ దగ్గర బాణసంచా(షార్ట్స్) కొన్నారని వారు తెలిపారు. అతను ఫుణెలో తమ బంధువు వాగ్దేకు పంపాలనే ఉద్దేశంతో కొన్నట్లు వివరించారు. బాణసంచా అని చెబితే ట్రాన్స్‌పోర్టు వారు తీసుకోరనే ఉద్దేశంతో గిఫ్టు ప్యాక్‌లని నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలిపారు.
ఇదీ చూడండి: