Another New Hospital Attached to Nims: తెలంగాణలో ప్రముఖ వైద్య సంస్థ నిమ్స్‌కు అనుబంధంగా మరో నూతన ఆసుపత్రిని నిర్మించడానికి ప్రభుత్వం రూ.1,571 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా పొందేందుకు సమ్మతించింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిమ్స్ నూతన ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుందని పేర్కొంది.
వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాదిరిగా నిర్మాణం చేపట్టాలని సూచించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నూతన ఆసుపత్రి నిర్మాణంతో నిమ్స్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 1,800 పడకలకు అదనంగా మరో 2వేలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఆక్సిజన్ పడకలే. వీటిలో 500 బెడ్లను ఐసీయూ సేవలకు కేటాయించారు.
నూతన ఆసుపత్రిలో గుండె, మూత్రపిండాలు, మెదడు, కాలేయం, క్యాన్సర్, అత్యవసర విభాగం, ట్రామా, ఆర్థోపెడిక్ తదితర 42 విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. కొత్త ఆసుపత్రి అందుబాటులోకి రావడం ద్వారా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పీజీ సీట్లు పెరుగుతాయి. ఆయా స్పెషాలిటీ విభాగాల్లో నర్సింగ్ సేవల్లోనూ ప్రత్యేక శిక్షణ పొందుతారు.
ఇప్పటికే నగరం నలువైపులా నాలుగు నిమ్స్‌ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా, వీటి ద్వారా ఒక్కో దాంట్లో 1000 చొప్పున మొత్తం 4వేల పడకలు.. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా మరో 2వేలు.. నిమ్స్‌లో కొత్తగా రానున్న 2వేలు, ఇప్పటికే నిమ్స్‌లో అందుబాటులో ఉన్న 1,800 కలుపుకుంటే.. దాదాపు 10వేల పడకలు సూపర్ స్పెషాలిటీ సేవల కోసం రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు వివరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ‘ట్విటర్’లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: