వాయిదా పడిన ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణ తేదీలను ఈ నెల 20 నుంచి 25వ తేదీలోగా ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. బుధవారం కమిషన్ సమావేశం అనంతరం కార్యదర్శి సీతారామాంజనేయులు విలేకర్లతో మాట్లాడారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను సివిల్స్ ప్రిలిమ్స్ జరిగిన తర్వాతే నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులకు ట్యాబ్ ద్వారా ప్రశ్నపత్రాలు అందజేస్తామన్నారు. వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని డిజిటిల్ విధానంలో జరపాలని ఆలోచిస్తున్నామన్నారు. కొవిడ్-19 కారణంగా ఉద్యోగ ఖాళీల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కమిషన్కు అందలేదన్నారు. ప్రభుత్వం ఖాళీల వివరాలను పంపిస్తే ప్రకటనల జారీకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి పరీక్షల నిర్వహణలో మార్పులు తీసుకువస్తున్నామని సీతారామాంజనేయులు వెల్లడించారు.
'ఇకపై పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను పంపించే ముందు తనిఖీ(ప్రిస్కింగ్) ఉండదు. శరీర ఉష్ణోగ్రతలను థర్మల్ స్కానింగ్ ద్వారా పరీక్షిస్తాం. పరీక్ష హాల్లోకి ప్రవేశించిన తర్వాత కంప్యూటర్ వెబ్ కెమెరా, సీసీ కెమెరాల ద్వారా ఫొటోలు తీయాలన్నది ఆలోచన. అనారోగ్యంగా ఉన్నవారిని ఐసోలేషన్ గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తాం. కమిషన్ ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ ద్వారా ప్రశ్న పత్రాల రూపకల్పన జరుగుతోంది. పరీక్ష ప్రారంభానికి 5 నిమిషాల ముందు అభ్యర్థులకు కేటాయించిన కంప్యూటర్లకు ప్రశ్నపత్రాలు వస్తాయి' అని సీతారామాంజనేయులు వివరించారు. జూనియర్ కళాశాలల అధ్యాపకుల ప్రధాన పరీక్ష తుది 'కీ', ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్షల 'రివైజ్డ్ కీ'ని త్వరలో విడుదల చేయనున్నామని చెప్పారు. కమిషన్ సమావేశానికి ఛైర్మన్ హాజరు కాలేదు.
ఇదీ చదవండి