Prathipati Pulla Rao Fire On YSRCP Govt: ముఖ్యమంత్రి జగన్ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని తెదేపా నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. 32 నెలల వైకాపా పాలనలో రైతులు అన్నివిధాలా నష్టపోయారన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల 40 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. రైతులకు మొక్కుబడిగా పరిహారం చెల్లించారని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు, విపత్తుల కింద రూ.4 వేల కోట్ల నిధి ఏర్పాటు హామీ ఏమైందని ప్రశ్నించారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో పంట కొనుగోలు చేయాలని నిలదీసిన రైతుపై కక్ష సాధింపుతో 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపేలా చేయటం దారుణమని ప్రత్తిపాటి అన్నారు. వైకాపా రెండున్నరేళ్ల పాలనలో దాదాపు 2 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. సీఎం జగన్ చేతగానితనం, అసమర్థత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.
పీఈర్సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ప్రత్తిపాటి ఆక్షేపించారు. ఆర్థిక ఇబ్బందులు, కరోనా కుంటి సాకులు చెప్పి రివర్స్ టెండరింగ్లాగే ఐఆర్ కంటే పీఆర్సీ తగ్గించారని ఎద్దేవా చేశారు. పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి ఓవైపు ఉద్యోగస్థులను మరోవైపు నిరుద్యోగులను మోసం చేశారన్నారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేక వయసు పెంపు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
ఓటీఎస్ పేరుతో సీఎం జగన్ సరికొత్త దోపిడీకి తెరలేపారని పుల్లారావు ఆరోపించారు. ప్రజలెవరూ ఓటీెఎస్ డబ్బు చెల్లించవద్దని సూచించారు. తెదేపా అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని, ఆటవిక పాలనను అంతమొందించేందుకు కలిసొచ్చే పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. కేసుల మాఫీ కోసం లోపాయికారికంగా పొత్తులు పెట్టుకుని ఎవరితో ఎవరు అంటకాగుతున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. తమ పార్టీ పొత్తుల కోసం ఎప్పుడూ పాకులాడదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి