Women Entrepreneur Vinoda Chandawat Story : తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ మాది. గిరిజన కుటుంబం. అమ్మనాన్నలు సక్కుబాయ్, నాగేశ్వరరావు నాయక్‌లు. మేం ముగ్గురం ఆడపిల్లలమే. నేను పెద్దదాన్ని. బంధువులంతా మగపిల్లాడు లేడన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘ఆడపిల్లలు ఏం చేస్తారు?’ అనేవారు పదేపదే. నాన్న మనసులోనూ అదే భావన బలపడింది. కానీ.. అమ్మ అలాకాదు. మమ్మల్ని గొప్పస్థాయిలో చూడాలనుకొనేది. అందుకోసం ఎంతైనా కష్టపడాలనుకుంది. ప్రభుత్వ రాయితీతో చేపల దుకాణాన్ని ప్రారంభించింది.
ఇంటికి రావొద్దు, మాతో మాట్లాడొద్దు.. స్కూల్ నుంచి రాగానే అమ్మకు సాయంగా చేపలు అమ్మేదాన్ని. ఒంటినిండా వాటి రక్తం.. నీచు వాసనే. చాలామంది ‘మీకెందుకివన్నీ’ అనేవారు. నాకేమాత్రం సిగ్గనిపించేది కాదు. అదే అన్నం పెడుతోందని నాకు బాగా తెలుసు. రోజంతా కష్టపడిన అమ్మని ‘అన్నం వడ్డించమని’ అనలేకపోయేదాన్ని. చెల్లెళ్లు చిన్నవాళ్లు కదా! నేనే వంట చేసేదాన్ని. అలా నాకు వంటలు, అందులో వాడే మసాలాలపై అవగాహన ఏర్పడింది. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ‘లా’పై ఇష్టంతో లాసెట్ రాసినా.. కుటుంబానికి తోడుగా ఉండాలని ఆ ఆలోచన విరమించుకుని డిగ్రీ చేశాను. అమ్మకు నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని కోరిక. అందుకే డిగ్రీ అయ్యాక గ్రూప్స్ కోచింగ్ కోసమని హైదరాబాద్ వచ్చా. మొదటి ప్రయత్నంలోనే మెయిన్స్‌కి ఎంపికయ్యా. కానీ ‘రిజర్వేషన్ ఉందిగా వస్తుందిలే’ అని బయటవాళ్లు అన్న మాటలతో నాకా ఉద్యోగంమీద ఆసక్తి పోయింది. దాంతో మెయిన్స్ రాయలేదు. ఇది ఇంట్లో తెలిసి.. ‘ఇంటికి రావొద్దు, మాతో మాట్లాడొద్దు’ అన్నారు.
ఐటీ ఉద్యోగుల కోసం.. ఇంటినుంచి పాకెట్‌మనీ ఆగిపోవడంతో.. హైదరాబాద్‌లోనే ఏదైనా చేయాలనుకున్నా. పదో తరగతే నుంచే నాకు సొంతంగా ఏదైనా చేయాలని ఉండేది. చిన్ననాటి నుంచి వంటలమీదున్న ఆసక్తితో అందులోనే ప్రయత్నిద్దామనుకున్నా. ఐటీ విస్తరిస్తున్న సమయంలో.. బీపీవో కంపెనీ ఉద్యోగులకు భోజనం సరఫరా కాంట్రాక్ట్ పొందా. రోజూ 200 మందికి భోజనం అందించేదాన్ని. ఇవికాక గృహ ప్రవేశాలు, శుభకార్యాలకూ సప్లై చేశా. అందులోనూ సంతృప్తి కలగలేదు. మసాలాల తయారీపై దృష్టి పెట్టా. ఎన్నో ప్రయోగాలు చేశాక.. 2016లో కాచిగూడలో రూ.60వేలతో ‘మల్హారి పుడ్స్’ పేరుతో చిన్న స్టాల్ ప్రారంభించా. నేను సొంతంగా చేసిన మసాలాలను మార్కెట్‌కు పరిచయం చేశా. ‘ఇంట్లో చేసుకున్నట్టుగా ఉన్నాయి.. చిన్న స్టాల్ కాదు. పరిశ్రమే పెట్టొచ్చు’ అనేవారు చాలామంది. పరిశ్రమ పెట్టాలని ప్రభుత్వం మహిళలకు అందించే రాయితీల గురించి వాకబు చేశా. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.
ది మహిళా ఫ్యాక్టరీ.. అమీర్‌పేటలో ఓ బ్యాంకు అధికారి ‘ముందు వ్యాపారం మొదలుపెట్టు. యంత్ర సామగ్రికి కావాల్సిన రుణం అందేలా చూస్తా’మన్నారు. దాంతో నా దగ్గరున్న బంగారం అమ్మి, స్నేహితుల సాయంతో రూ.25లక్షలు జమ చేశా. చర్లపల్లి పారిశ్రామికవాడలో రసాయనాలు వాడని ‘శ్రీమల్హారి మసాలా ఆర్గానిక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో సంస్థకు శ్రీకారం చుట్టా. బ్యాంకు లోన్ రాగానే యంత్రాలు కొన్నా. మసాలాలతో మొదలుపెట్టి.. కారం పొడులు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు.. ఇలా 80రకాల ఉత్పత్తులు చేస్తున్నా. శ్రీ మల్హారి మసాలా, నమస్తే కిచెన్స్ బ్రాండ్ పేరుతో అమ్మకాలు మొదలుపెట్టా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆర్నెల్లు శాంపిళ్లు పంచిపెట్టా. ప్రజల నుంచి ఆదరణ లభించడంతో ఉత్పత్తులు పెంచాం. సరిగ్గా డిమాండ్ అందుకున్న సమయంలో కరోనా వచ్చింది. లాభాలు తగ్గాయి. అయినా భయపడలేదు. ప్రస్తుతం రూ. 3 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు సింగపూర్, యూకే, అమెరికా, దుబాయి వంటి దేశాల్లోనూ మా ఉత్పత్తుల్ని మార్కెట్ చేస్తున్నాం. సంస్థలో 20మంది మహిళలు పనిచేస్తున్నారు. ‘ది మహిళా ఫ్యాక్టరీ’ పేరుతో ప్రత్యేకంగా స్టోర్‌ను ప్రారంభించా. చెల్లెళ్లిద్దరూ ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో స్థిరపడ్డారు. తలరాత ఎలా అయినా ఉండొచ్చు.. సంకల్పంతో దానిని మార్చుకోవచ్చని బలంగా నమ్మాను. నాతో ఇప్పుడు అమ్మ కూడా ఏకీభవిస్తోంది.
ఇవీ చదవండి: