EFFECTS ON IT CAMPUS RECRUITMENTS DUE TO FINANCE RECESSION : ఆర్థిక మాంద్యం భయంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేపట్టిన నియంత్రణ చర్యల ప్రభావం ప్రాంగణ నియామకాలపై పడింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు నియామకాలు చేపట్టిన ప్రముఖ కంపెనీలు.. ఇప్పుడు కొంతమందిని చేర్చుకోవడంపై వేచి చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం 2023 మార్చి తర్వాత పిలుస్తామని చెబుతున్నాయి. మరికొన్ని.. అభ్యర్థులకు సరైన సమాధానం చెప్పకుండా కళాశాలల ప్రాంగణ నియామక అధికారులను కలవాలని సూచిస్తున్నాయి. కానీ, ఆ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఈ మాంద్యం వచ్చే ఏడాది జులై వరకు ఉండొచ్చని ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇప్పుడు దశలవారీ నియామకాలు చేపడుతున్నాయి. మొదట స్వల్ప మొత్తంలో నియామకాలు చేసుకోవడం, తర్వాత పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకోవాలనే విధానాన్ని పాటిస్తున్నాయి. గతంలో 500మంది విద్యార్థులు ఎంపిక ప్రక్రియలో పాల్గొంటే.. కనీసం 200మందిని ఎంపిక చేసుకునేవి. ఇప్పుడు ఇది వందలోపే ఉంటోంది. ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థులను చేర్చుకోవడాన్ని వాయిదా వేస్తున్నాయి. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం ఉండబోదని.. రెండు, మూడు త్రైమాసికాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత.. నియామకాలు వేగం పుంజుకుంటాయంటున్నారు.
‘‘ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నాయి. నాలుగు నెలలు క్రితం ఉన్న నియామకాల జోరు ప్రస్తుతం కనపడటం లేదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు నియామకాలు, ఉద్యోగాల సంఖ్యపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక వేత్తల విశ్లేషణల ప్రకారం ఇది దీర్ఘకాలం ఉండబోదు. రెండు, మూడు త్రైమాసికాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత నియామకాలు వేగం పుంజుకుంటాయి. ఈ సమయంలో విద్యార్థులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి’’-కోట సాయి కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య
ఇవీ చదవండి: