Delhi Liquor Scam Latest Update: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. ఈ స్కామ్‌లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మరొకరిని అరెస్టు చేసింది. చారియట్ మీడియాకు చెందిన రాజేశ్ జోషిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మద్యం కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు తరలించినట్లు రాజేశ్ జోషిపై ఆరోపణలు వచ్చాయి. కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఆయన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
ED arrests gautam malhotra in Delhi liquor scam: ఇక ఇప్పటికే మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను.. ఈడీ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతన్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Kavitha Ex Auditor arrested in Delhi liquor policy : దిల్లీ మద్యం వ్యాపారంలో కీలకపాత్ర పోషించిన సౌత్ గ్రూప్‌నకు బుచ్చిబాబు ప్రతినిధిగా వ్యవహరించారని, అరబిందో శరత్‌చంద్రారెడ్డి తన తరఫున ఆర్థిక, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేందుకు ఆయనను రంగంలోకి దింపినట్లు దర్యాప్తులో వెల్లడయింది. హైదరాబాద్ దోమల్‌గూడలోని ఆయన కార్యాలయంలో దర్యాప్తు సంస్థలు పలుమార్లు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం ఆయనను దిల్లీకి పిలిపించి విచారించారు. చివరకు అరెస్టు చేశారు. సౌత్‌గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పెద్దలకు రూ.వంద కోట్ల ముడుపులు ముట్టాయన్నది దర్యాప్తు సంస్థల అభియోగం. ఇందులో కీలకపాత్ర బుచ్చిబాబుదేనని సీబీఐ భావిస్తోంది. విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలు పలువురు నిందితులు, అనుమానితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొన్న ప్రకారం.. దిల్లీలో జరిగిన అనేక సమావేశాల్లో బుచ్చిబాబు పాల్గొన్నారు.
MLC Kavitha in Delhi liquor scam : ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన ఆయన ఆర్థిక వ్యవహారాల్లో దిట్ట. మద్యం వ్యాపారానికి సంబంధించి అనేక సలహాలు ఇస్తుండేవారు. అందుకే ఆయనను అరెస్టు చేశారు. దాంతో తదుపరి వంతు ఎవరిదన్న దానిపై చర్చ మొదలైంది. గత కొద్ది నెలలుగా ఈ కేసు రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఇదివరకే విచారించారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గురించి ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఈడీ మొత్తం 63 మందిని విచారించగా అందులో 11 మంది తెలుగువారు ఉన్నారు. నిధుల మళ్లింపు వ్యవహారంలో పీఎమ్‌ఎల్‌ఏ చట్టం కింద ఈడీ, అవినీతి చట్టం కింద సీబీఐ సమాంతరంగా కేసు దర్యాప్తు జరుపుతున్నాయి. రెండు సంస్థలు వేరువేరుగా కేసులు నమోదు చేశాయి. దాంతో ఎప్పుడు ఎవరు, ఎవర్ని అరెస్టు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
దిల్లీ మద్యం కేసులో ఉన్న తెలుగువారు..
తక్కళ్లపల్లి లుపిన్: అభిషేక్ బోయిన్‌పల్లికి వరుసకు సోదరుడు. లంచం సొమ్మును బదిలీ చేయడంలో సహకరించారు.
అరుణ్‌పిళ్లై: కల్వకుంట్ల కవిత తరఫున ఇండోస్పిరిట్‌లో భాగస్వామిగా వ్యవహరించారు.
బుచ్చిబాబు: దిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్ గ్రూప్ తరఫున ప్రతినిధిగా వ్యవహరించారు.
గౌతమ్ ముత్తా: ఇండియా అహెడ్ న్యూస్ ప్రై.లిమిటెడ్, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌లో డైరెక్టర్.
అభిషేక్ బోయిన్‌పల్లి: దిల్లీ మద్యం వ్యాపారంలో కీలకంగా వ్యవహరించారు. శరత్‌రెడ్డి తరఫున దిల్లీలో రిటైల్ జోన్స్ నిర్వహించారు.
హేమాంబర్ వజ్రాల: శరత్‌రెడ్డికి చెందిన ఆటో రియాలిటీ సంస్థలో కార్పొరేట్ ఎఫైర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.
చందన్‌రెడ్డి: ఆటో రియాలిటీ సంస్థ ఉద్యోగి. దిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగంగా కార్టెల్ ఎల్7 జోన్స్ పరిధిలో అవంతిక, ట్రైడెంట్, ఆర్గానామిక్స్ వ్యవహారాలు పర్యవేక్షించారు.
టి.రాజ్‌కుమార్: ఆర్గానామిక్స్‌లో మెజారిటీ షేర్లు కలిగి ఉన్నారు.
ఎస్‌హెచ్.నర్సింహారావు: సౌత్‌గ్రూపునకు చెందిన అవంతిక, ఆర్గానామిక్స్, ట్రైడెంట్‌లలో నగదు లావాదేవీలను పర్యవేక్షించారు.
కె.నరేందర్‌రెడ్డి: అవంతిక కాంట్రాక్టర్స్ సంస్థలో డైరెక్టర్, షేర్‌హోల్డర్.
వి.శ్రీనివాస్‌రావు: ఎమ్మెల్సీ కవిత అనుచరుడు.
ఎస్.శ్రీనివాస్‌రావు: పెర్నాడ్ రికార్డ్ సంస్థ నాణ్యత నియంత్రణ వ్యవహారాల ఉద్యోగి.
ఇవీ చదవండి: