TDP PROTEST:గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకు దిగిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు దుర్గికి పార్టీ నాయకులు రాకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. పార్టీ శ్రేణుల ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుర్గిలో 144సెక్షన్ విధించారు. మాచర్ల తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి... దుర్గికి రాకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఆయన బైక్‌పై దుర్గి బయలుదేరగా ఒప్పిచర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మారెడ్డిని గుంటూరుకు తరలించారు.
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళనకు బయలుదేరిన తెలుగుదేశం నేత మధుని మాచర్లలో పోలీసులు గృహనిర్భందం చేశారు. ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని దుర్గి బయలుదేరారు. దీంతో ఆయన్ని కారంపూడిలో పోలీసులు అరెస్టు చేశారు. నేతల అరెస్టు సందర్భంగా ఆందోళనకు దిగిన తెలుగుదేశం కార్యకర్తలను అరెస్టు చేసి ఈపూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు తెలుగుదేశం నాయకులు దుర్గికి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. నరసరావుపేట తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవిందబాబుతో ముఖ్యమైన నాయకులను గృహనిర్భందం చేశారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రభుత్వం కుట్ర: ప్రత్తిపాటి
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈమేరకు చిలకలూరిపేటలో సమావేశం నిర్వహించిన ఆయన..ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం వైకాపా అరచాలకు నిదర్శనమన్నారు. వైకాపా స్కీములన్నీ స్కాముల కోసమే అన్న ప్రత్తిపాటి రాష్ట్రంలో ప్రజల ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అరాచకాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజలు తిరగబడతారని స్పష్టం చేశారు.