చెత్త శుద్ధికి చిత్తశుద్ధి కరవవుతోంది. స్వచ్ఛభారత్ లక్ష్యాలకు అనుగుణంగా చెత్త.. వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు ఆ బాధ్యతను మరుస్తున్నారు. రోడ్లపై చెత్తను వదిలేసి ప్రజారోగ్యంతోపాటు వాతావరణాన్ని గుల్ల చేస్తున్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో చూస్తే రోడ్లే డంపింగ్ యార్డులుగా మారాయి. చెత్తతో సంపద తయారీ పక్కన పెడితే వాటి నిర్వహణ కూడా సక్రమంగా జరగట్లేదు.
- సత్తెనపల్లి పట్టణంలో గతంలో ఏర్పాటుచేసిన రెండు డంపింగ్ యార్డులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో అక్కడ చెత్త వేయడం నిలిపివేశారు. కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటులో నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆర్‌అండ్‌బీ రోడ్డే డంపింగ్ యార్డుగా మారింది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వెళ్లే మార్గంలో ఎన్నాదేవి వద్ద రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు. రోజూ 27 మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణంలో నుంచి సేకరిస్తారు. మరోవైపు వర్షానికి చెత్తంతా బసవమ్మ వాగులో చేరి పొలాల్లో పంట ఎదుగుదలకు ప్రతిబంధకాల్ని తెస్తోంది.
- క్రోసూరులో కేజీబీవీ ఎదురుగా రూ.10 లక్షలతో నిర్మించిన సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. చెత్తను రోడ్డు పక్కన పడేస్తున్నారు.
- ముప్పాళ్లలో సంపద తయారీ కేంద్రం ఉన్నా వినియోగంలోకి రాలేదు. దీంతో నరసరావుపేట, తురకపాలెం రోడ్ల పక్కనే చెత్తను పడేస్తున్నారు. ఇటీవల యునిసెఫ్ బృందం ఈ మండలంలో ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తించిన గోళ్లపాడు పంచాయతీని సందర్శించి సంపద తయారీ కేంద్రం వాడుకలోకి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
- తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురంలోనూ డంపింగ్ యార్డులు లేవు. సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాలకు సంబంధించి చెత్త సేకరణకు తుళ్లూరు మండలంలోని వెంకటపాలెంలో రూ.5 కోట్లతో సంపద తయారీ కేంద్రం నిర్మించే ఆలోచన చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు ఆదిలోనే నిలిచిపోయాయి.
రూ.కోట్ల నిధులు వృథాగా..
ఉపాధి హామీ పథకం నిధులతో సంపద తయారీ కేంద్రాల నిర్మాణాన్ని గత ప్రభుత్వ హయాంలో విస్తృతంగా చేపట్టారు. ఒక్కో గ్రామంలో రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిధులు వెచ్చించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 60 పంచాయతీల్లో సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యయంతో డంపింగ్ యార్డులు నిర్మిస్తే నందిగామ పంచాయతీలోనే ఆదర్శంగా ఘనవ్యర్థాల నిర్వహణ జరుగుతోంది. మిగిలిన అన్ని పంచాయతీల్లోనూ అవి కనీసం వాడుకలోకి కూడా రాలేదు. పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లోని 126 గ్రామ సచివాలయాల పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆ రెండుచోట్ల రూ.20 కోట్ల వ్యయం చేశారు. మూడు నియోజకవర్గాల్లో రూ.50 కోట్లకు పైబడి ప్రజాధనం సంపద తయారీ కేంద్రాల రూపంలో వృథాగా మారడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముంది. స్వచ్ఛభారత్ లక్ష్యాల సాధనలో చెత్తశుద్ధి.. వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలక అంశంగా అధికారులు గుర్తించాలి. సత్తెనపల్లిలో డంపింగ్ యార్డు ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని కమిషనర్ శ్రీనివాసరావు చెప్పారు. మండల కేంద్రాల్లో డంపింగ్ యార్డులు వాడుకలోకి తీసుకురావడంపై శ్రద్ధ చూపిస్తామని ఎంపీడీవోలు తెలిపారు.
- అమరావతిలో డంపింగ్ యార్డు ఉన్నా నిర్వహణ లేక ఎందుకూ కొరగాకుండా మారింది. దీంతో విజయవాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే చెత్తవేసి మూడ్రోజులకు ఒకసారి కాలుస్తున్నారు. వ్యర్థాల నుంచి వచ్చే పొగను భరించలేకపోతున్నామని ప్రజలతోపాటు రైతులు వాపోతున్నారు.
- మేజర్ పంచాయతీ అయిన పెదకూరపాడులో 12 వేల మంది జనాభా ఉన్నారు. డంపింగ్ యార్డు నిర్మాణమై విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడం.. యంత్రాలు బిగించే దశలో పనులు ఆగిపోయాయి. సంపద సృష్టించే అవకాశమున్నా ఆ దిశగా చర్యల్లేక రోడ్డుపైనే వ్యర్థాలు పడేసి కాల్చేస్తున్నారు.
ఇదీ చూడండి. గుంటూరులో నిలిచిన జగనన్న గోరుముద్ద పంపిణీ