గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, బాపట్ల, తెనాలి ఏరియాల్లో మలేరియా, డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలమ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మలేరియా నివారణ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రామ్ మాధవరావు తెలిపారు. శనివారం తెనాలి మలేరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నేరుగా పరిశీలించారు.
'జిల్లాలో డెంగ్యూ మలేరియా కేసులు'
జిల్లా వ్యాప్తంగా గుంటూరు అర్బన్‌లో మలేరియా వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతోందన్నారు. ఈ వారం రోజులలో గుంటూరులో 2 డెంగ్యూ, 5 మలేరియా కేసులు వెలుగుచూశాయన్నారు. గత ఏడాది గుంటూరు అర్బన్ ఏరియాలో మలేరియా 25 కేసులు, డెంగ్యూ 59 కేసులు నమోదైనట్లు వివరించారు.
'ఫ్రైడే ఫ్రైడే విధానాన్ని తప్పక అనుసరించాలి'
నీటి నిల్వలు ఎక్కువగా ఉండడంతో 'ఎడిస్' దోమ ప్రభావంతో ఇటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటి నిర్మూలనకు తగు చర్యలు చేపట్టినట్లు రామ్ మాధవరావు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించి.. ఆయా గ్రామాలలో ఏ ప్రాంతాలలో నీటి నిల్వలు ఎక్కువగా ఉంటుందో దాంట్లో పొందుపరుస్తునట్లు తెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించి చైతన్యం చేయడానికి ప్రతి ఫ్రైడేను డ్రై డే గా నిర్వహించి.. నీటిని నిల్వ చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
25న ప్రపంచ మలేరియా దినోత్సవం..
ఈనెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం రానున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు, ఇతర అధికారులు సమీక్షలో ఈ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. దోమల నివారణకు మత్స్య శాఖతో సమన్వయం చేసుకుంటూ.. దీర్ఘకాలం నీటి నిల్వ ఉండే ప్రదేశంలో 'గంబూషియా' చేపను ఆ నీటిలో వదిలి నీటిపై ఉన్న లార్వాను చంపే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రజల పూర్తి భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు.