Demolition of houses in Chandrayanagar: గుంటూరు శ్రీనగర్ కాలనీ పరిధిలో 6 దశాబ్దాల క్రితం చంద్రయ్య నగర్ ఏర్పాటైంది. ప్రభుత్వం ఇచ్చిన బీ-ఫామ్ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునిపేదలు నివాసం ఉంటున్నారు. 2015 కృష్ణా పుష్కరాల సమయంలో రహదారుల విస్తరణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లకు నోటీసులిచ్చారు. అమరావతి రోడ్డు నుంచి ఠాగూర్ విగ్రహం వరకు విస్తరించాలని అప్పట్లో నిర్ణయించారు. రోడ్డుకు ఎడమవైపు నిర్మాణాలు తొలగించి.. పరిహారం, స్థలాలకు బాండ్లు ఇచ్చారు. అప్పట్లో కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో.. చంద్రయ్యనగర్ వైపు రోడ్డు విస్తరణ ఆగిపోయింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు విస్తరణ పనులు చేపట్టారు.
మంగళవారం సాయంత్రం చంద్రయ్య నగర్‌కు వచ్చిన అధికారులు.. ఇళ్లు తొలగిస్తామని, సామాన్లు తీసుకుపోవాలని నోటిమాటగా చెప్పి వెళ్లిపోయారు. బుధవారం ఉదయమే పొక్లెయిన్లతో కూల్చివేతలు చేపట్టడంతో.. చంద్రయ్య నగర్ నివాసితులు హతాశులయ్యారు. 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ఉన్నఫళంగా ఖాళీ చేయమంటే ఎలాగని ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వాలని కోరినా యంత్రాంగం పట్టించుకోలేదు.
ఉన్నతాధికారుల ఆదేశాలంటూ కూల్చివేతలు కొనసాగించారు. సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఇళ్లు కూల్చివేస్తే రోడ్డున పడతామంటూ జయమ్మ అనే మహిళ పొక్లెయిన్ తొట్టెలో కూర్చుని నిరసన తెలిపారు. కొన్ని ఇళ్ల ప్రహరీలు, మరుగుదొడ్లను నేలమట్టం చేశారు. తెలుగుదేశం నాయకులతో కలిసి స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో.. తాత్కాలికంగా కూల్చివేతలు ఆపేశారు.
గత ప్రభుత్వ హయాంలో విస్తరణ చేపట్టినప్పుడు.. ప్రధాన రహదారికి కుడివైపు నిర్మాణాలను తొలగించి పరిహారం ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం నోటీసులు ఇవ్వకుండా, పరిహారం కూడా ప్రకటించకుండా.. హడావుడిగా కూల్చివేతలు చేపట్టారని వాపోయారు. పరిహారం, ప్రత్యామ్నాయం తేల్చకుండా కూల్చివేతలు చేపడితే అడ్డుకుని తీరతామని తేల్చిచెబుతున్నారు.
ప్రస్తుతానికి అధికారులు కూల్చివేతల్ని ఆపేసినా.. మళ్లీ ఎప్పుడు వస్తారోనన్న భయం చంద్రయ్య నగర్ ప్రజల్లో నెలకొంది. బాధితులకు అండగా ఉంటామన్న తెలుగుదేశం నేతలు.. పరిహారం ఇచ్చాకే విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రయ్య నగర్‌లో మొత్తం 51 ఇళ్ల నిర్మాణాలు తొలగించేందుకు అధికారులు సిద్ధమవగా.. 23 మందికి బీ-ఫారం పట్టాలు ఉన్నాయి. 18 మంది వద్ద స్వాధీన ఒప్పందాలు ఉండగా.. 10 మంది వద్ద ఎలాంటి కాగితాలూ లేవు. బీ-ఫారాలు ఉన్న 28 మందికిపరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. స్వాధీన ఒప్పందాలు ఉన్నవారికి పరిహారంపై.. కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు.
బుధవారం కొట్టివేసిన 10 ఇళ్లకు రెండు రోజుల్లో పరిహారం చెక్కులు ఇస్తామని నగరపాలక సంస్థ వర్గాలు తెలిపాయి. కూల్చివేతలపై ఆందోళన చెందుతున్న బాధితులతో.. మేయర్ కావటి మనోహర్ నాయుడు బుధవారం రాత్రి మాట్లాడారు. శంకర్ విలాస్ వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నందున.. ప్రత్యామ్నాయ మార్గంగా శ్రీనగర్ కాలనీ రోడ్డుని విస్తరిస్తున్నట్లు చెప్పారు. దీనికి చంద్రయ్య నగర్ కాలనీ వాసులు సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి: