ప్రజలకు లాటరీ ఆశ చూపించి సైబర్ మోసగాళ్లు లక్షల రూపాయలు దోచేస్తున్నారు. కోటి రూపాయలు లాటరీ వచ్చింది.. జీఎస్టీ కట్టాలంటూ లక్షల రూపాయలు నగదు అమాయకుల నుంచి కాజేస్తున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఇద్దరు బాధితులు 21 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అసలు విషయంలోకి వెళితే..
ముట్లూరుకు చెందిన చైతన్యకు ఆగస్టు 31న భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ వచ్చింది. మీకు కోటి 24 లక్షల రూపాయలు లాటరీ వచ్చిందంటూ పదే పదే ఫోన్ చేశారు. లాటరీ నగదు ఇవ్వాలంటే రూ.8 లక్షలు జీఎస్టీ కట్టాలని చెప్పారు. నిజమే అనుకుని నమ్మిన బాధితుడు...సెప్టెంబర్ 1 నుంచి 27తేదీల మధ్య విడతల వారీగా రూ.8 లక్షలు వారి బ్యాంకు ఖాతాలకు ఫోన్ పే, గూగుల్ పే నుంచి జమ చేశాడు. ఆ తరువాత నుంచి వాళ్ల ఫోన్ నెంబర్ పని చేయకపోవడం.. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు పిర్యాదు చేశాడు.
ఇదే మండలంలో గారపాడుకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ గత నెల రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల మాయలో పడి స్వయంగా బ్యాంకుకు వెళ్లి రూ.13 లక్షలు సైబర్ మోసగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేసింది. అనంతరం వారి ఫోన్ స్విచ్చాఫ్ చేయడం మోసపోయినట్లు గ్రహించి.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి...