CS JAWAHAR COMMENTS ON CM JAGAN DELHI TOUR: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచిన వేళ.. సీఎం జగన్ ముందుగా అనుకున్న విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో,.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మీడియా సమావేశం..ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అంశాలపై ఉన్నతస్థాయిలో మాట్లాడేందుకు గత నెలలో ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లారని.. ఇప్పుడు మరోమారు దిల్లీకి ఆయన వెళ్లనున్నట్టు జవహర్ రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్తారని స్పష్టం చేశారు. దీని కోసం ఆయన తన వ్యక్తిగత పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీతో భేటీ కోసం ఏపీ నుంచి సీఎస్ నేతృత్వంలోని కమిటీ దిల్లీ వెళ్తున్నట్టు ఆయన తెలిపారు. రెవెన్యూ లోటు సహా పోలవరం , తెలంగాణ నుంచి జెన్కోకు రావాల్సిన బకాయిల విషయంలోనూ కేంద్రంతో జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని.. తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నందున తన నేతృత్వంలో ఆర్థిక శాఖ సహా కొన్ని కీలకమైన శాఖల కార్యదర్శులు దిల్లీకి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ అంశాల్లో ఉన్నతస్థాయిలో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి దిల్లీలో ఉండటం అవసరమని భావిస్తున్నట్టు తెలిపారు. కార్యదర్శుల స్థాయిలో తాము వెళ్లినా.. ముఖ్యమంత్రి జగన్ కూడా దిల్లీలో ఉంటే మేలని వెల్లడించారు.
గతంలో రెవెన్యూ లోటు ముగిసిన అధ్యాయం అని ప్రకటించినా .. మళ్లీ కేంద్రం దీన్ని పునరాలోచించాలని నిర్ణయించిందన్నారు. దీంతో పాటు పోలవరం అంశంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కూడా ఉంటే తుది నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశముందని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన అంశాలపై తన నేతృత్వంలో కార్యదర్శుల కమిటీ దిల్లీ వెళ్తున్నప్పటికీ ఎవరిని కలుస్తున్నారన్న అంశంపై మాత్రం సీఎస్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. పోలవరం సహా రెవెన్యూ లోటు విషయంలో ఎంత ఇస్తారన్న అంశాన్ని కూడా సీఎస్ స్పష్టం చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో కొన్ని కొలిక్కి వచ్చినా అంతిమంగా వాటిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మాత్రమేనని ఆయన దాటవేశారు. కార్యదర్శుల స్థాయిలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముంటుందన్న ప్రశ్నకూ ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు.
ఆర్థిక ఇబ్బందులతో వసతి దీవెన వాయిదా: మరో వైపు.. నిధుల్లేకే ఈ నెల 17న జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈ నెల 26కు వాయిదా వేశామని.. సీఎస్ చెప్పారు. ఎన్నికల చివరి ఏడాదిలో కొత్త పథకాలేవీ ఉండకపోవచ్చన్నారు. ఉద్యోగులకు దాదాపు 5 వేల కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించామని, వేతనాలు కూడా సకాలంలో చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని.. జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలోనే.. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఉంటుందని ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. SS రావత్ వెల్లడించారు. రోడ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో లేవన్నారు.
ఇవీ చదవండి: