Expensive Vehicles for Government Officials రోజువారీ అవసరాల కోసం ప్రతి నెలా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఆ నిధులను విలాసాలకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వానికి పనులు చేసిన కాంట్రాక్టర్లతో పాటు చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు.. వేలు, లక్షల్లో బిల్లులు చెల్లించేందుకు నానా ఇబ్బందులు పెడుతున్న అధికారులు.. అప్పులు తెచ్చిన నిధులతో విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హోదాతో సంబంధం లేకుండా అధికారులకు విలాసవంతమైన కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రోటోకాల్ రీత్యా న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టు న్యాయమూర్తులకు సరైన వాహనాలు లేకపోవటంతో వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది.
అయితే అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులకు మాత్రమే కొనుగోలు చేయాల్సిన ఈ తరహా వాహనాలు ఇప్పుడు హోదాతో సంబంధమే లేకుండా కొందరు ఆధికారులు ఆయా శాఖల నిధులతో కొనుగోలు చేస్తుండటం వివాదాస్పదం అవుతోంది. సాధారణ పరిపాలన శాఖలోని ప్రోటోకాల్ విభాగం హోదాను అనుసరించి వేర్వేరు స్థాయిల్లో వాహనాలను కేటాయిస్తుంది.
ముఖ్యమంత్రికి బులెట్ ప్రూఫ్ కాన్వాయ్, మంత్రులకు పైలట్‌తో కూడిన రెండు వాహనాల కాన్వాయ్, చీఫ్ సెక్రెటరీ, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఇలా వేర్వేరు స్థాయిల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వమే అధికారిక వాహనాలు సమకూరుస్తుంది. మంత్రులు , అధికారులు ఏ స్థాయిలో ఏ వాహనం వినియోగించాలో ప్రభుత్వమే అధికారిక ఉత్తర్వులు గతంలోనే జారీ చేసింది.
అయితే కొందరు విభాగాధిపతుల హోదాలో ఉన్న అధికారులు స్థాయి లేకపోయినా విలాసవంతమైన కియా కార్నివాల్ కార్లను ఆయా శాఖల నిధులతోనే కొంటున్నారు. వాస్తవానికి న్యాయమూర్తుల కోసం 25 కియా కార్నివాల్ వాహనాలను అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్కో వాహనానికి 40 లక్షల రూపాయల చొప్పున ఈ వాహనాలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వాహనాల్లో ఒక వాహనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం కేటాయించారు.
మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులకు టయోటా క్రిస్టా వాహనాలను సమకూర్చారు. మరికొందరికి గతంలో కొనుగోలు చేసిన ఇసుజు వాహనాలను ఇచ్చారు. అయితే అవి పాతపడిపోయాయంటూ.. కొందరు కియా కార్నివాల్ వాహనాలు కొనుగోలు చేశారు. మంత్రులు 25 లక్షల రూపాయల వాహనాల్లో తిరుగుతుంటే.. కొందరు అధికారులు మాత్రం 40 లక్షల విలువైన కార్లు వాడుతున్నారు.
పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ శాఖ, మార్క్ ఫెడ్ , రహదారులు భవనాల శాఖ ఇలా వేర్వేరు విభాగాధిపతులు ఖరీదైన కియా కార్నివాల్ వాహనాలు వినియోగిస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు అర్హత లేకపోయినా.. కియా కార్నివాల్ కారును వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వారి మంత్రులకు, కార్యదర్శులకు అధికారిక వాహనాలుగా అత్యంత తక్కువ వ్యయం అయ్యే వాహనాలనే కొనుగోలు చేసి వినియోగిస్తోంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మాత్రం.. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇవీ చదవండి: