అమరావతికి మద్ధతుగా గుంటూరులో అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆందోళన చేపట్టారు. హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసానికి వెళ్లే మార్గానికి అడ్డుగా బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు ఆందోళన చేసిన తర్వాత పోలీసులు విరమించాలని కోరినప్పటికీ అందుకు సీపీఐ నేతలు సమ్మతించలేదు. దీంతో వారిని అరెస్ట్ చేసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు..గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెెందిన ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తుంటే.. ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేయటాన్ని తప్పుబట్టారు. కేవలం పదవుల కోసమే వైకాపా నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.