గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివపురం తండాలో ఇటీవల జరిగిన ఘటనలో మృతి చెందిన మంత్రు భాయ్ కుటుంబసభ్యులను సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు పరామర్శించారు. అప్పు చెల్లించలేదని శివాపురం గ్రామంలో మంత్రు భాయ్ అనే మహిళను నర్సింగపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన దారుణమని ముప్పాళ్ల అన్నారు. ఇల్లు కూడా సరిగా లేక దారిద్య్రం అనుభవిస్తున్న మంత్రు భాయ్ కుటుంబంపై దయదాక్షిణ్యం లేకుండా వ్యవహరించిన శ్రీనివాసరెడ్డి తీరు దారుణమన్నారు. మంత్రు భాయ్ భర్త మంత్రు నాయక్ లు తమ ఐదుగురు కూతుళ్లను పెంచి పోషించి వారికి పెళ్లిళ్లు చేసేందుకు అప్పు చేశారన్నారు. అప్పు కింద తమ భూమిని తీసుకుని మిగిలిన సొమ్మును ఇవ్వమని కోరినా ఆ కుటుంబంపై దయ చూపకుండా వారితో శ్రీనివాసరెడ్డి మూడేళ్లుగా వెట్టి చాకిరీ చేయించుకున్నారన్నారు.
విజయవాడలో భారీ సదస్సు
సరైన సమయంలో నకరికల్లు పోలీసులు స్పందించి నేరస్థుడిని పట్టుకుని శిక్ష పడేలా చేశారని ముప్పాళ్ల అన్నారు. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాన్ని రూ.8 లక్షల 50 వేలు నష్టపరిహారం అందజేసిందన్నారు. ప్రభుత్వం వీరి పరిస్థితిని గమనించి బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం అందించేలా కృషి చేయాలన్నారు. లేదా శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాసరెడ్డి ఆస్తిని జప్తు చేసి బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందజేసేలా ప్రభుత్వం చూడాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్రంలో ఇదేవిధంగా దాడులకు, వేధింపులకు గురైన దళితులు, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను కలుస్తామని ఆయన అన్నారు. వారందరితో విజయవాడలో భారీ సదస్సు ఏర్పాటు చేస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి : శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ