గుంటూరులోని ఐడీ ఆసుపత్రిలో సోమవారం ఒక్క రోజే 10మంది... కరోనా అనుమానిత లక్షణాలతో చేరారు. వీరందరూ విదేశాల నుంచి వచ్చిన వారే అని గుర్తించిన వైద్యులు అప్రమత్తమయ్యారు. అమెరికా, ఇటలీ, సింగపూర్ వంటి దేశాల నుంచి దిల్లీ, హైదరాబాద్ వచ్చి... అక్కడి నుంచి గుంటూరు చేరుకున్నట్టు గుర్తించారు. వీరంతా 14రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉన్నారని... అయితే దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే వైద్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ కారణంగా వారిని ప్రత్యేక అంబులెన్సుల్లో గుంటూరులోని ఐడి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో ఉన్న 10 బెడ్లు వారికి కేటాయించారు. మరొకరికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం కలిగిన కారణంగా.. ఆతడిని గుంటూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అంతా కలిపి 11 మంది అనుమానితులు ఉన్నారని వైద్యులు వెల్లడించారు. వీరి నమూనాలు ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం 11మంది పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. నివేదికల ఆధారంగా తదుపరి చికిత్స అందిస్తామన్నారు.
అప్రమత్తమైన యంత్రాంగం..
విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో మొదటి నుంచి అప్రమత్తంగా లేకపోవటమే ఇంతటి సంఖ్యలో అనుమానితులు వెలుగు చూడడానికి కారణమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో అప్రమత్తమైంది. ఐడీ ఆసుపత్రిలో మరో 10 పడకలు సిద్ధం చేస్తున్నారు. అలాగే గుంటూరు సర్వజన ఆసుపత్రిలోనూ అనుమానితులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలికంగా 100పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగర శివార్లలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న అధికారులు... అందుకు తగిన స్థలం కోసం పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి: