గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. గ్రామస్థులంతా ఒకే మాటపై నిలిచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇప్పటి దాకా గ్రామంలో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు లేదు. గ్రామంలో 826 కుటుంబాలు ఉండగా.. 3028 మంది మహమ్మారి బారిన పడకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు.
అందరి బాట.. ఒకే మాట.
అధికారులు, గ్రామస్థులు సమన్వయంతో వ్యవహరిస్తూ కొవిడ్ కేసులు రాకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు.. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుండగా, పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామస్థులంతా సహకరిస్తూ నిబంధనలు పాటిస్తున్నారు. మొదటి దశలో కరోనా వచ్చినప్పటి నుండి నేటి వరకు గ్రామస్థులు స్వీయ రక్షణ చర్యలు చేపట్టారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి వచ్చినపుడు అప్రమత్తంగా ఉండి వెళ్లే దాకా జాగ్రత్తలు తీసుకోవటం, అత్యవసరమైతే తప్ప గ్రామం నుంచి బయటకు వెళ్లకపోవడం, గ్రామం మొత్తం ఒకే మాట మీద నిలవడంతో కేసులు రాకుండా కట్టడి చేయగలిగారు.
గ్రామస్థుల సహకారంతోనే సాధ్యమైంది
మొదటి, రెండో దశల్లో నేటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడానికి గ్రామస్థులతో పాటు సంబంధిత అధికారుల కృషి ఉంది. మొదటి దశలో గ్రామ ప్రత్యేకాధికారి డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు సర్పంచి గోపు కృష్ణ, గ్రామస్థులు, వైద్య సిబ్బంది, యువత సహకారంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టడం, మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇలా అందరి సహకారంతోనే సాధ్యమైంది. - భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి
ఇదీ చదవండి: ఫీవర్ సర్వేలో బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులు