గుంటూరులో పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. కరోనా వైరస్ సోకిన వారి వద్ద నుంచి కాంటాక్టుల సేకరణ పక్కాగా చేయాలని నగర కమీషనర్ చల్లా అనురాధ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వివరాలు సేకరించాక వారిని బయటకు రాకుండా హోం క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాలంటీర్, ఆశా వర్కర్, ఎఎన్ఎంలతో కలిసి ప్రతీ గడపకు వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. ఎవరికైనా లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని గుర్తించి వారితో ప్రతిరోజు కాంటాక్ట్ లో ఉండాలని తెలిపారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కలిగించాలని పేర్కొన్నారు.
పరీక్షలకు వచ్చే వారు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ముందుగా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. అత్యవసరమయితే తప్ప ఇంటి నుంచి ప్రజలు బయటకు రావద్దని కోరారు. మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం తప్పకుండా పాటించడం, ప్రతి గంటకు చేతులను శుభ్రపరచుకోవడం, రోడ్లపై ఉమ్మి వేయకపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: 'పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి అమలు చేయాలి'