కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఉపాధి కోల్పోయి బతుకు భారమై జీవిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ కరెంట్ చార్జీల పేరుతో దోపిడీ చేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, కొత్త టారీఫ్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈనెల 13న అన్ని విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన్నట్లు గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన వివరించారు.
మాట తప్పను.. మడమ తిప్పను అని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్ నేడు మాట తప్పి మడమ తిప్పాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చామని.. విద్యుత్తు చార్జీలు పెంచిన దాఖలలే లేవని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 200ల యూనిట్ల వరకు బిల్లులు కట్టనవసరం లేదన్న జగన్.. దొంగదారిలో చార్జీలు పెంచడం దారుణమన్నారు. జగన్ నిజంగా రాజన్న వారసుడు అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. విద్యుత్ సవరణల పేరుతో రూ.7600 కోట్లు దోచుకున్నారని.. దీనిపైన న్యాయమూర్తి చేత విచారణ చేపట్టాలన్నారు. ప్రజలు, మేధావులు మాట్లాడకపోతే సామాన్యులపై మరింత భారం పెరుగుతుందని.. ప్రజల తిరగబడాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఇదీ చదవండి: గుంటూరు జీజీహెచ్ ఎదుట తెదేపా, కాంగ్రెస్ నాయకుల ఆందోళన