గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పార్టీ నాయకుడు బైరా కృష్ణకు చిలకలూరిపేటలోని అడ్డరోడ్డు కూడలి వద్ద ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ పక్కనే ఉన్న రేకుల షెడ్లను ఆక్రమణల పేరిట మున్సిపల్ అధికారులు తొలగించారు. తొలుత ఈ ప్రక్రియను ఆపాలని బైరా కృష్ణ కోరగా.... దానికి పురపాలక కమిషనర్ ఒప్పుకోలేదు. ఆక్రమణలు తొలగిస్తేనే ఇక్కడ నుంచి కదులుతానని నేలపై కూర్చున్నారు.
ఇటీవల ప్రభల యాత్ర సందర్భంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యే విడదల రజిని కక్ష గట్టి తమ బార్ అండ్ రెస్టారెంట్ పక్కన ఉన్న రేకుల షెడ్లను ఆక్రమణ పేరుతో పురపాలక కమిషనర్ ద్వారా తొలగించారని బైరా కృష్ణ ఆరోపించారు. తాము మాజీ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు అనుకూలంగా ఉన్నందునే.... దురుద్దేశంతో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ పరిణామాలపై తమ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని వైకాపా నాయకుడు బైరా కృష్ణ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై పురపాలక కమిషనర్‌ను వివరణ కోరగా తాను మాట్లాడనని పక్కకు వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: