బాపట్ల ప్రాంతీయ వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తామని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కొవిడ్ కేంద్రాన్ని, స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారికి మెరుగైన వసతులు కల్పించి, నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. సిబ్బంది వాహనాలను బాధితులు ఉంటున్న భవనాల సమీపంలో పార్కింగ్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ పరికరాలు తెప్పించి ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స చేయటానికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో కరోనా నోడల్ వైద్యాధికారి సాంబశివరావు అందుబాటులో లేకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరీక్షల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేశారు. 24 గంటల్లో కొవిడ్ ఫలితాలు వెల్లడి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరు అడిగి తెలుసుకున్నారు.