గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న కొవిడ్ రోగులకు అనుగుణంగా బెడ్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జీజీహెచ్లో కొవిడ్–19 వైద్యసేవలపై సంయుక్త కలెక్టర్ ప్రశాంతితో కలిసి కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్షించారు. రోజువారీగా ఆసుపత్రిలో అడ్మిషన్, డిశ్ఛార్జుల నిర్వహణకు ప్రత్యేకంగా సీనియర్ అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి వార్డులో కొవిడ్ రోగుల ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్యసేవలపై ప్రతిరోజు నివేదిక అందించాలన్నారు. ఆక్సిజన్ నిర్వహణకు ప్రత్యేకంగా అధికారిని నియమించాలని…ప్రతి వార్డులో ఆక్సిజన్ పర్యవేక్షణకు నర్సుకు బాధ్యత అప్పగించాలని సూచించారు. ఆక్సిజన్ సరఫరా, ప్రెజర్, పైపులైన్ లీకేజీలను బయో మెడికల్ ఇంజనీర్ల ద్వారా ప్రతి షిఫ్టులోనూ తనిఖీలు చేసి రికార్డులో నమోదు చేయాలని తెలిపారు.
రోగులకు పౌష్టికాహారం సకాలంలో అందించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో వ్యర్ధాలను, పనికిరాని వస్తువులను నగరపాలక సంస్థ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులతో తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి శుభ్రం చేయించాలన్నారు. తీవ్ర ఆనారోగ్య లక్షణాల నుంచి రికవరీ అయిన వారిని స్టెప్ డౌన్ సెంటర్లకు తరలించి వైద్యసేవలు అందించాలన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న రోగులలో ఆక్సిజన్ లెవల్స్ మెరుగుపర్చేందుకు ప్రోనింగ్ పొజిషన్స్, బ్రీత్ ఎక్సైర్ సైజులు చేయించాలని.. సంబంధిత పోస్టర్లు వార్డులలో ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన బ్యాకప్ జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.