త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని కలిసేందుకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాచర్ల రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పింగళి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జాతీయ జెండా రూపకల్పనలో వెంకయ్య ఎలాంటి కసరత్తు చేశారు. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి. దేశం కోసం వెంకయ్య ఎలాంటి త్యాగాలు చేశారు అనే అంశాలను ఆయన కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. జాతీయ పతాకం రూపొందించి మార్చి 31వ తేదీకి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్న పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీని.. ఆమె కుటుంబ సభ్యులను సత్కరించి సముచిత గౌరవం అందించేందుకు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచర్లకు వస్తున్నారు. నాన్నపై అభిమానంతో తనను కలుసుకునేందుకు ముఖ్యమంత్రి రావడం పట్ల సీతామహాలక్ష్మీ ఆనందం వ్యక్తం చేస్తోంది.
బ్రిటిష్ వారు పాలించే రోజుల్లో మనకంటూ ప్రత్యేక జెండా ఉండాలన్నది తన తండ్రి సంకల్పమని తండ్రితో తనకున్న జ్ఞాపకాలు పంచుకున్నారు సీతామహాలక్ష్మీ. భారత జాతి గర్వించతగ్గ వ్యక్తుల్లో తన తండ్రి ఒకరని చెప్పారు. ఆయనకు ఆ గుర్తింపు ఉంటే అది జాతీయ జెండాకు దక్కిన గౌరవంగా భవిస్తామన్నారు.
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తెగా నన్ను గుర్తిస్తూ.. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. కోట్లాది మంది వందనాలు స్వీకరించే.. త్రివర్ణ పతకాన్ని రూపొందించిన మా నాన్న గాంధీగారికి ప్రియ శిష్యుడు. ఆయనను ప్రతిసారి తలచుకుంటాం. ప్రపంచ గుర్తించదగిన.. నిస్వార్థ, నిరాడంబర జీవి మా నాన్న. - సీతామహాలక్ష్మీ, పింగళి వెంకయ్య కుమార్తె
మా తాత.. త్రివర్ణపతాక రూపకర్తగానే కాకుండా.. అనేక కార్యక్రమాలు చేశారు. జీవితంలో కొన్ని నియమాలు పెట్టుకున్న ఆయన.. చివరి వరకు వాటికి కట్టుబడే ఉన్నారు. దేశానికి ఉపయోగపడే చదువులు మాత్రమే చదవాలనుకునేవారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఆయన చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. కేవలం ఒకే భాషకు పరిమితమైతే.. యువత ఏదీ సాధించాలేరని మా తాత గారు చెప్పారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఆయన.. ఉత్తర భారతంలో కూడా వెలుగు వెలగడానికి కమ్యూనికేషన్ స్కిల్సే కారణం.. బహుభాషా కోవిదుడు మా తాత.
- పింగళి వెంకయ్య మనుమడు
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి'