తెదేపాపై అన్ని వర్గాల ప్రజల్లో అసాధారణమైన స్పందన కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిచోటా ప్రజల్లో వీరోచిత స్ఫూర్తి కనిపిస్తోందని తెలిపారు. ప్రజల్లో ఉన్న కసిని, పౌరుషాన్ని ఓట్లుగా మార్చుకోవాలని సూచించారు. వైకాపాపై ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రాలేదనీ.. రాష్ట్రాన్ని, తెదేపాను నిందించడానికి మాత్రం పెద్దనోరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నిందలతో మనలో పని చేయాలనే పట్టుదల పెరగాలన్నారు.
తెరాసతో కలిసి జగన్ హోదా సాధిస్తారా?
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలన్న కేసీఆర్తో కలిసి జగన్ హోదా తెస్తారా అని చురకలంటించారు. తెరాసతో కలిసి జగన్ హోదా సాధిస్తాననడం హాస్యాస్పదమన్నారు. కేసుల కోసం మోదీతో,... ఆస్తుల కోసం కేసీఆర్తో జగన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. సొంత లాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు జగన్ గండికొడుతున్నారని మండిపడ్డారు. అద్దె మైకులు, వలస పక్షులు వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాయనీ.. ఎన్నికలు కాగానే అందరూ హైదరాబాద్ చెక్కేస్తారన్నారు. కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీనటులు జగన్ వద్దకు క్యూ కడుతున్నారని విమర్శించారు.
మోదీ, జగన్ ప్రమాదకారులు
'ఒక్కసారి ప్లీజ్' అంటూ వైకాపా మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. మోదీ, జగన్ సమాజానికి అత్యంత ప్రమాదకారులనీ.. మైనారిటీల ద్వేషి నరేంద్ర మోదీకి జగన్ మద్దతు పలుకుతున్నాడన్నారు. భాజపాకే కాదు వైకాపాకూ మైనారిటీలు బుద్ధి చెప్పాలని కోరారు. వైకాపాకు ఓటేస్తే పోలవరం పనులు నిలిచిపోతాయనీ.. తెదేపాతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు.
ఇవీ చదవండి..