ప్రతి మున్సిపాల్టీలో భూగర్భ డ్రైనేజీ ఉండాలని.. మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఘన వ్యర్థాల నిర్వహణ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, మున్సిపాల్టీలలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రణాళికలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ ,ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై సమాలోచనలు జరిపారు. వీటి కోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సమీక్షించారు. మున్సిపల్ స్కూళ్లలోని సమస్యలు తెలుసుకున్న సీఎం.. వాటిని అభివృద్ధి చేయటంపై చర్చించారు. స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మూడింట ఒక వంతు నగరాలు, మున్సిపాల్టీలలోని స్కూళ్లను తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీల కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.
మోడల్ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి
గుంటూరు జిల్లాలో తాను నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంపై సీఎం వరాలు కురిపించారు. తాడేపల్లి, మంగళగిరిలను ఆదర్శ మున్సిపాల్టీలుగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై చర్చించారు. తాడేపల్లి, మంగళగిరిలో ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని అన్నారు. తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలని సూచించారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సూచించారు. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కృష్ణానది కట్టమీద, కరకట్ట లోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణం కింద ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో కోరుకున్న చోట వీరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లతో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలం ఇళ్లుకట్టి ఉంటున్నవారికి పట్టాలు మంజూరుచేయాలన్నారు. బకింగ్ హాం కెనాల్ కాలుష్యం కాకుండా చూడాలని.. కాల్వ గట్లపై చెట్లను బాగా పెంచాలని ఆదేశించారు. మంత్రి బొత్స సత్యనారాయణ సహా ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.