గుంటూరు జిల్లా నరసారావుపేటలోని జేఎన్టీయూ క్యాంపస్ భవనాల నిర్మాణ పనులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. జేఎన్టీయూ క్యాంపస్ భవనాల శిలా ఫలకాలను సీఎం ఆవిష్కరించారు. మొత్తం 80 కోట్ల రూపాయల వ్యయంతో నర్సారావుపేటలో ప్రభుత్వం జేఎన్టీయూ క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టింది.
నరసారావుపేట కాలేజీలో 2016లో మొదటి బ్యాచ్ ప్రారంభం అయ్యిందని .. భవనాల శంకుస్థాపన చేసే సమయానికి అప్పుడు చేరిన పిల్లలు ఆఖరు సంవత్సరానికి చేరుకున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వారి కోసం భవనాల నిర్మాణం చేపట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వం ఏనాడూ చేయలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకూ విద్యార్ధులు ప్రైవేటు కళాశాలలు, ల్యాబ్‌లలో నెట్టుకుంటూ రావటం శోచనీయమని సీఎం అన్నారు. ఈ పరిస్థితులను మార్చాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.
పల్నాడుకు మేలు...
జేఎన్టీయూ క్యాంపస్ నిర్మాణం ద్వారా వెనకబడిన పల్నాడు ప్రాంతానికి మేలు జరుగుతోందని సీఎం అన్నారు. ప్రస్తుత ఏడాదికి రూ.80 కోట్లు మంజూరు చేశామని.. వచ్చే ఏడాదికి మౌలిక సదుపాయల కల్పనకు మరో రూ.40 కోట్లను విడుదల చేస్తామని తెలిపారు. జేఎన్టీయూలో పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన కళాశాల నిర్మాణం పూర్తి అవుతుందన్న సీఎం....ల్యాబ్‌లను కూడా నిర్మిస్తామని చెప్పారు.