PM KISAN AND RAITHU BHAROSA SCHEME : పీఎం కిసాన్ పథకం కింద 13వ విడత సాయంగా సోమవారమే.. రైతు ఖాతాల్లో సొమ్ము జమ అయింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 16 వేల కోట్ల రూపాయల్ని జమ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనూ సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు రెండు వేల రూపాయల చొప్పున 1,000 కోట్ల రూపాయలకు పైగా నిధులందాయి. ఇవే నిధులకు ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరు జిల్లా తెనాలిలో బటన్ నొక్కబోతున్నారు.
పీఎం కిసాన్ -రైతు భరోసా పథకం కింద నాలుగో సంవత్సరం మూడో విడత కింద 1,090.76 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి అందులో.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 90 కోట్ల రూపాయలు కూడా ఉండటం లేదు. ఇవి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, అటవీభూముల హక్కుదారులకు ఇస్తున్నారు.
అయినా మిగిలిన 1,000 కోట్ల రూపాలకు పైగా మొత్తాన్ని తమ ఖాతాలోనే వేసుకుని, తామే విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. పీఎం కిసాన్ కింద రూ. 2వేలు సోమవారమే ఖాతాల్లోకి వస్తే.. మంగళవారం మళ్లీ బటన్ నొక్కడం ఎందుకో అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇవాళ మళ్లీ 2వేల రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేస్తారా అని.. కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు.
పీఎం కిసాన్- రైతు భరోసా కింద ఇప్పటి వరకు 27వేల 062 కోట్ల రూపాయలు విడుదల చేశామని.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో రైతుకు 13 వేల 500 రూపాయల చొప్పున ఇస్తున్నామని.. దేశ చరిత్రలోనే ఇదో రికార్డని సీఎం జగన్ చెబుతున్నారు. వాస్తవానికి.. ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి 12 వేల 500 రూపాయల చొప్పున ఒకేసారి మే నెలలోనే ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో వైసీపీ హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో రూ.7,500 చొప్పున మాత్రమే ఇస్తోంది. మిగిలిన 6వేల రూపాయలను పీఎం-కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వాటిని కూడా తమ ఖాతాలో కలిపేసిన ముఖ్యమంత్రి జగన్.. ఏడాదికి మూడుసార్లు బటన్ నొక్కుతూ నాలుగేళ్లుగా రైతుల కళ్లకు గంతులు కడుతున్నారు. వాస్తవానికి సీఎం నేడు రాష్ట్రంలోని లక్షా 72వేల కుటుంబాలకే 2వేల రూపాయల చొప్పున విడుదల చేస్తున్నారు. ఆ విషయాన్ని కప్పి పెట్టి 51లక్షల 12వేల మంది రైతు కుటుంబాలకు 1,090కోట్ల 76 లక్షల రూపాయలు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.
2022 డిసెంబరు నెలలో మాండోస్ తుపాను విరుచుకుపడటంతో సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. అయితే 91,237 మంది ఉద్యాన రైతుల, వ్యవసాయ పంటలే దెబ్బతిన్నాయని ప్రభుత్వం లెక్క కట్టింది. వీరికి.. 78కోట్ల 99లక్షల రూపాయల పెట్టుబడి రాయితీని మంగళవారం ప్రభుత్వం విడుదల చేయనుంది. నిజానికి మాండౌస్ తుపాను కారణంగా.. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోత దశలో ఉన్న వరి నేల వాలింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగు మారింది.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు చోట్ల పొగాకు దెబ్బతినడం వల్ల.. రైతులు ఎకరాకు 25వేల రూపాయలకు పైగా పెట్టుబడుల్ని కోల్పోయారు. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం, YSR, అన్నమయ్య తదితర జిల్లాల్లో శనగ పంట దెబ్బతింది. బొప్పాయి, అరటి తదితర పండ్ల తోటలూ దెబ్బతిన్నాయి. పల్నాడు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మిరప రైతులు తుపాను సుడిలో చిక్కుకున్నారు. అయినా ప్రభుత్వం పంట నష్టం పెద్దగా లేదన్నట్లుగా వ్యవహరిస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: