CM Jagan on Agriculture: సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఖరీప్ సీజన్ ముగియనుండటంతో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రైతులు మద్దతు ధరకన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా వినిపించడానికి వీల్లేదని.. అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకుని పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలోనూ మిల్లర్ల పాత్ర పూర్తిగా తొలగించి... రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. ఇ–క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ జరగాలని ఆదేశించారు. వ్యవసాయశాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
ఖరీప్ సీజన్ ముగింపు దశకు చేరడంతో రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు, సహా అన్ని రకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈనెల 29న సున్నావడ్డీ పంట రుణాలతోపాటు ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక డ్రోన్ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం... వచ్చే రెండేళ్లలలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా ఇచ్చిన వ్యవసాయ యంత్రసామగ్రి అంతా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని రైతులందరికీ వీటి సేవలు అందాలన్నారు. అదేవిధంగా భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: