తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు గణనీయంగా పెరిగినప్పటికీ, పంట చేతికి చేరేసరికి ధరలు పడిపోతున్నాయనీ.. ఈ పరిస్థితిని మార్చాల్సి ఉందని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయ పడ్డారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల నిల్వ సామర్ధ్యం పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రారంభించాలంటూ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పీఎం కిసాన్ సీఈఓ, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మిషన్ డైరెక్టర్ వివేక్ అగర్వాల్‌తోనూ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్)కి సంబంధించిన వివరాలను ఆయన సీఎంకు వివరించారు. ఏపీకి అన్ని రకాలుగానూ సహకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ వివేక్ అగర్వాల్‌కు వివరించారు. ప్రతీ గ్రామంలోనూ సచివాలయాలు, దానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నట్ట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతులకు అందేలా సహాయకారిగా ఈ ఆర్బీకేలు పని చేస్తాయని వివరించారు. పంటలకు సంబంధించి ఇ-క్రాప్ బుకింగ్ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. పంటల వివరాలతో కూడిన జియో లోకేషన్ కూడా ట్యాగ్ అవుతుందని వెల్లడించారు. ఆర్బీకేల ద్వారా బీమా, రుణ సదుపాయం, గిట్టుబాటు ధరలు వంటి ఇబ్బందులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
గోదాముల్లోనే ప్రీ ప్రాసెసింగ్..
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడుతున్నామని.. దీని కోసం ప్రత్యేకమైన ప్లాట్ ఫాం తీసుకు వస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో జనతా బజార్లను కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నామని.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను అక్కడ ప్రజలకు విక్రయిస్తామని వివరించారు. ప్రతీ గ్రామంలోనూ కోల్డ్ స్టోరేజీలు, గోదాములను నిర్మించనున్నట్టు వెల్లడించారు. గోదాముల్లోనే ప్రీ ప్రాసెసింగ్‌తో పాటు గ్రేడింగ్ కూడా చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టమోటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమాలు.. రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు లక్ష్యసాధనకు ఉపకరిస్తాయని ఆశిస్తున్నట్టు సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామని.. పంట చేతికి వచ్చే నాటికి ధరలు తగ్గిపోతున్నాయని.. వీటిపై దృష్టి సారించినట్టు సీఎం తెలిపారు. అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఐజీఎంస్ను సందర్శించిన డీజీపీ గౌతమ్ సవాంగ్