CM Jagan Photos on Anganwadi bags: ప్రజాధనాన్ని ప్రచారానికి వినియోగించుకోవడంలో ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. పబ్లిసిటీ కోసం ఆయన అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే కోడిగుడ్లనూ విడిచి పెట్టలేదు. అన్నింటా ఆయన బొమ్మ, నవరత్నాల ముద్ర, నీలం రంగు ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే. తాజాగా అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసే వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం మరో ప్రచారాస్త్రంగా మలచుకునేందుకు తెరతీశారు. ఈ పథకం పాతదే.. సరకులు ఇంటికి ఇవ్వడమూ ఇదే తొలిసారి కాదు. పంపిణీ చేసేవీ కొత్తవి కాదు. కానీ సరికొత్త ప్రచార ఎత్తుగడలో భాగంగా దీన్ని ఏకంగా జగన్ ప్రచార పథకంగా మార్చేందుకు నిర్ణయించారు.
- ALSO READ: విశ్వవిద్యాలయాల అభివద్ధిపై జగన్ సమావేశం.. ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడాలంటూ డాంబికాలు
గర్భిణులు, బాలింతలకు జులై 1 నుంచి బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు తదితర సరకులు ఇంటికే ఇస్తామని జూన్‌లో ఉత్తర్వులిచ్చారు. సరకులను సంచుల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సంచిపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల ముద్ర ఉండేలా నమూనా రూపొందించారు. జిల్లాల వారీగా తయారీకి టెండర్లు పిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు లక్షలకు పైగా గర్భిణులు, బాలింతలు సేవలు పొందుతున్నారు. వీరికి ఇచ్చే ఒక్కో సంచి తయారీకి 40 రూపాయల చొప్పున 2కోట్ల 40 లక్షల వ్యయం కానుంది. జీఎస్టీ ఇతర ఖర్చులు కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ధర సరిపోదని గుత్తేదారులు అసంతృప్తిగా ఉన్నారు. కాగా సరకుల పంపిణీ ప్రక్రియ ఈ నెల 1వ తేదీకి బదులు తొలుత 15కి, తర్వాత 30వ తేదీకి వాయిదా పడింది.
గర్భిణులు, బాలింతలకు సరకులు ఇంటికి పంపితే వారికి పూర్తిస్థాయిలో పోషకాహారం అందదనే ఉద్దేశంతోనే అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది గర్భిణులు, బాలింతలు ఇంటికే సరకులు కోరుకుంటున్నారని, అందుకే ఇంటికే రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గర్భిణులు, బాలింతలు తరచూ కేంద్రాలకు వస్తున్నా.. అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణ ఉన్నా.. వారిలో రక్తహీనత సమస్య పూర్తిగా నివారించలేకపోతున్నారు. అలాంటిది సరకుల కోసం నెలలో రెండుసార్లు మాత్రమే కేంద్రాలకు వస్తే ఆరోగ్య సమస్యలు ఎలా గుర్తించేది అనే దానిపై స్పష్టత కరవైంది. అలాగే వారు వచ్చే రోజుల్లో పోషకాహార దినోత్సవాన్ని చేపట్టి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం వడ్డించకుండా గర్భిణులు, బాలింతలకు ఇంటి సరుకులు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం 23 కోట్ల 62 లక్షల రూపాయలతో కేంద్రాల్లో వంట సామగ్రి కొనుగోలుకు అనుమతివ్వడం వెనుక ఆంతర్యం తెలియడం లేదు. ఈ మొత్తంతో వంట పాత్రలు, కుక్కర్లు, గ్యాస్ స్టవ్‌లు కొనుగోలుకు అనుమతిచ్చింది. గర్భిణులు, బాలింతలకు ఇంటికే సరుకులిస్తే 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే కేంద్రాల్లో వంట చేసి వడ్డిస్తారు. ప్రస్తుతమున్న వంట పాత్రలే చాలాచోట్ల సరిపోతాయని సంఘాల నేతలు చెబుతున్నారు. రెండు నెలల కిందటే ఈ ప్రతిపాదన రాగా సంబంధిత దస్త్రాన్ని వెనక్కి పంపినట్టు సమాచారం. ఇప్పుడు దానికి పచ్చజెండా ఊపారు. ఇంటికి సరకుల పంపిణీ తర్వాత వంట సామగ్రి కొనుగోలు విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు.