CM Jagan Meeting With YSRCP MLAs : వైఎస్సార్సీపీలో నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులు చేర్పులపై మంతనాలు సర్దుబాట్లు శుక్రవారం కొనసాగాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు వచ్చి వారి టికెట్లపై ఆరా తీశారు. మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
అక్కడ ఒకరిద్దరు ముఖ్యమంత్రిని, మిగిలిన వారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఐ-ప్యాక్ ప్రతినిధులను కలిశారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సీఎం క్యాంపు కార్యా లయం వద్ద ఐ-ప్యాక్ (I-Pack) బృందాన్ని కలిశారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి సర్వే రిపోర్టులను అందజేసినట్లు తెలిసింది. తనను వేరే నియోజకవర్గానికి వెళ్లాలని సీఎం జగన్ చెబుతున్నారని దీనిపై ఆలోచించుకుని రావాలని సూచించినట్లు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి తెలిపారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు.
సీఎం జగన్ ఎదుటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం
CM Jagan Changing Constituency Incharge : నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును ఈసారి గుంటూరు లోక్‌సభ స్థానానికి మారాలని సీఎం చెప్పగా నరసరావుపేటలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ కల్పించుకుంటూ నరసరావుపేటలో ఈసారి బీసీకి టికెట్ ఇవ్వాలనుకుంటున్నామని అందువల్ల గుంటూరుకు మారాలని చెప్పారని తెలిసింది. గుంటూరు పరిధిలోని రాజధాని అమరావతి విషయమై పార్టీ సరైన స్పష్టత ఇవ్వలేదని అలాంటప్పుడు అక్కడి ప్రజలకు ఏం సమాధానం చెప్పగలమని ఎంపీ తన అభిప్రాయాన్ని సీఎంకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇన్‌ఛార్జుల మార్పుపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి- పనిచేయని బుజ్జగింపులు- పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు
2024 Elections in AP : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును శుక్రవారం ముఖ్యమంత్రి పిలిపించుకుని మాట్లాడారు. మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి కర్నూలు లోక్‌సభ స్థానానికి మారుస్తారనే చర్చ జరుగుతున్నా సీఎంతో భేటీ తర్వాత ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఆయనకు సీటు ఉంటుందా? లేదా? ఉంటే ఎక్కడ ఉంటుందనే విషయాన్ని రెండు మూడు రోజుల్లో స్పష్టతనిస్తామని చెప్పినట్లు తెలిసింది.
మైలవరం నియోజకవర్గంపై ఇప్పటికే రెండు మూడు దఫాలు చర్చలు జరపగా అక్కడి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శుక్రవారం కూడా వచ్చారు. ఆయన్ను మైలవరంలోనే కొనసాగిస్తారని చెబుతున్నా ఇతర ప్రతిపాదనలపైనా చర్చించేందుకే ఆయన్ను పిలిచి మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది.
'మీకో దండం జగన్'- తాడేపల్లి సీఎంవోకు గుడ్‌బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి