CM Jagan Inaugurates Sub Stations in Andhra Pradesh: ఏపీలో సౌర విద్యుత్ ప్రాజెక్టులతో పాటు 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించారు. మరో 12 విద్యుత్ సబ్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. సౌర, పవన విద్యుత్, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులకు సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎం వెల్లడించారు.
కడప జిల్లాలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు 12 సబ్ స్టేషన్లను ప్రారంబించినట్టు సీఎం కార్యాలయం తెలిపింది.
విద్యుత్ సబ్ స్టేషన్లు, మొత్తం ప్రాజెక్టుల విలువ 6 వేల 600 కోట్ల రూపాయలని స్పష్టం చేసింది. దీంతో పాటు పునరుత్పాదక విద్యుత్ రంగంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌తో ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు గాను 10వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు అవగాహన ఒప్పందం కుదిరినట్టు తెలిపింది. మొత్తం 14 జిల్లాల్లో 3 వేల 99 కోట్ల రూపాయల విలువైన సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
విలీన మండలాలైన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక తదితర మండలాల్లో సబ్ స్టేషన్ల సమస్యను పరిష్కరిస్తూ వీటిని నిర్మించినట్టు సీఎం జగన్ వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు వీలుగా 1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చేందుకు వీలుగా రూ.2.49లకే యూనిట్ ధరతో సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీతో (Solar Energy Corporation of India) ఒప్పందం చేసుకున్నట్టు సీఎం తెలిపారు.
మొత్తం 17 వేల మిలియన్ యూనిట్ల సరఫరా చేసేందుకు గానూ ఈ ఒప్పందం కుదిరిందన్నారు. తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. ఈ ఒప్పందంతో 2024 సెప్టెంబరు నాటికి 3 వేల మెగావాట్లు, 2025 నాటికి మరో 3 వేల మెగావాట్లు ఆ పై వచ్చే ఏడాదికి 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.
మరోవైపు 3 వేల 400 కోట్ల రూపాయలతో 850 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకీ సైతం అవేరా (Avera) సంస్థ ముందుకు వచ్చిందని.. ఇప్పటికే 25 వేల స్కూటర్లను ఉత్పత్తిని ప్రారంభించి విజయవాడలో నిర్వహిస్తోందని సీఎం జగన్ వివరించారు.
ఈ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన శంకుస్థాపన కూడా చేసినట్టు సీఎం తెలిపారు. హెచ్‌పీసీఎల్‌తో (Hindustan Petroleum Corporation Limited) 500 మెగావాట్లు సౌర విద్యుత్, 500 మెగావాట్ల పవన విద్యుత్.. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి వ్యవస్థతో 10 వేల కోట్లకు ఒప్పందం కుదిరిందని సీఎం జగన్ వివరించారు.
విజయనగరం మండలం వేణుగోపాలపురం వద్ద రూ. 179 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన 220/132/33 కిలోవాట్ల విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి శంకుస్థాపన చేశారు. ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక ఒంటితాడి అగ్రహారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ద్వారా వివిధ రకాల విద్యుత్ సమస్యలు పరిష్కరించబడతాయి. రైతులకు, పారిశ్రామిక, వాణిజ్య, గృహ అవసరాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుందని.., డిప్యూటీ స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేణుగోపాలపురం వద్ద నిర్మించనున్న 220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ జిల్లా అభివృద్దికి మేలుమలుపుగా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక, గృహ అవసరాలు తీరడమే కాకుండా వేసవి విద్యుత్ సమస్యలు ఈ ఉపకేంద్రం ద్వారా తీరుతాయని కోలగట్ల చెప్పారు.
CM Jagan Visakha Tour: విశాఖతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్