CM DELHI TOUR: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ భేటీ అయ్యారు. విభజన హామీలు, విశాఖ-భోగాపురం జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడ తూర్పు హైవే ఏర్పాటు వంటి అంశాలను కేంద్రమంత్రితో చర్చించినట్లు సమాచారం. గడ్కరీతో సమావేశం అనంతరం కేంద్ర సమాచార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సైతం జగన్ భేటీ అయ్యారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన సీఎం జగన్..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీలో నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. విద్యా సంస్థలకు బడ్జెట్‌లో నిధులు, నూతన విద్యా విధానం అమలు అంశాలను చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో నాడు-నేడు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కేంద్రమంత్రికి జగన్ వివరించనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడ గురించి సైతం కేంద్రమంత్రికి తెలపనున్నారు.
అమిత్ షాతో సైతం భేటీ కానున్న సీఎం..
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా జగన్ ఇవాళ భేటీ కానున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ నిన్న ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియాలను వేర్వేరుగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: CM Jagan Meet PM Modi: ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి