CM Jagan Cheated AP Farmers: కోతల్లో జగన్‌కు జగనే సాటి. పంట నష్టం అంచనాల్లో కోత. పెట్టుబడి సాయంలో కోత. ఇలా నోటితో గొప్పలు చెప్పుకుంటూ సాయంలో కోతలు వేస్తుంటారు. రైతులకూ అలాంటి నయవంచనే చేశారు సీఎం జగన్. మిగ్‌జాం తుపాను, కరవు ప్రభావంతో జరిగిన పంట నష్టం అంచనాల్ని భారీగా కుదించేశారు. దాదాపు 43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగితే దాన్ని 21లక్షల ఎకరాలకే పరిమితం చేస్తున్నారు. పెట్టుబడి రాయితీని 1289కోట్ల రూపాయలకు పరిమితం చేసేందుకు సిద్ధమయ్యారు. అంటే ఒక్కో రైతుకు సగటున దక్కేది 6వేల 175రూపాయలే.
22 జిల్లాలు 11లక్షల ఎకరాల్లోని వ్యవసాయ పంటలు, లక్షా 12 వేల ఎకరాల్లోని ఉద్యాన పంటలు. ఇదీ మిగ్‌జాం తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి రాష్ట ప్రభుత్వ శాఖలు ఇచ్చిన లెక్కలు. మొత్తంగా 790 కోట్ల రూపాయలమేర పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదిక పంపారు.
నయవంచనకు దిగిన జగన్ సర్కార్: తాజా అంచనాలు మాత్రం రివర్స్ అయ్యాయి. లెక్కల్లో సగం వరకూ కోతపడ్డాయి. 6 లక్షల 64 వేల ఎకరాల్లోనే పంటనష్టమని తేల్చారు. ఇందులో 5లక్షల 99 వేల ఎకరాల్లో వ్యవసాయ, 64 వేల 700 ఎకరాల్లో ఉద్యా న పంటలు దెబ్బతిన్నట్లు నివేదించారు. పెట్టుబడి రాయితీగా 442 కోట్లు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. అంటే ప్రాథమిక అంచనా మొత్తంతో పోలిస్తే పంట నష్టపోయిన విస్తీర్ణం ఏకంగా 5 లక్షల 52 వేల ఎకరాలు తగ్గించారు. పెట్టుబడి సాయంలో 348 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అంచనాల్లో ఎందుకింత నయవంచన.
సాగునీటి కష్టాలను ఎదుర్కోంటోన్న రాయలసీమ- కరువు ప్రభావం ఎలా ఉంది
తుపాను ప్రభావంతో రైతులకు అగచాట్లు: మిగ్‌జాం తుపాను వరి, మిరప, పొగాకు, మినుము తదితర పంటల్ని నీటముంచింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలొచ్చింది. కోతకొచ్చిన వరిలో దాదాపు 90శాతం నేల వాలింది. ఆరబెట్టిన ధాన్యమూ తడిసింది. దాన్ని అమ్ముకునేందుకు రైతులు పడరానిపాట్లు పడ్డారు. బస్తా ధాన్యానికి 4 కిలోల నుంచి 10 కిలోలు అదనంగా ఇచ్చారు. చివరకు రవాణా ఖర్చుల్నీ భరించారు.
అర్థంలేని సాకులతో రైతుకు అన్యాయం : పంట నష్టంలో నిబంధనల పేరుతో కోత పెట్టారు. 33శాతం నష్టం లేదని కొన్నిచోట్ల, కోసి పనలపై ఉన్న పంట నష్టపోతే లెక్కలోకి తీసుకోలేమని కొన్నిచోట్ల మొండిచేయి చూపారు. మొక్కజొన్న మొదలు కంటా విరిగిపడలేదంటూ నష్టంలోకి తీసుకోలేదు. ఇలా రకరకాల సాకులతో రైతులకు తీరని అన్యాయం చేశారు.
కడప జిల్లాలో ఎండిపోతున్న శనగ పంట - ప్రభుత్వం పరిహారం చెల్లించాలంటున్న రైతులు
నష్టమేమి లేదని లెక్కచేయలేదు: మిగ్‌జాం తుపాను మిగిల్చిన అరకొర పంటల్నీ కరవు కాటేసింది. కానీ జగన్ కొద్దిపాటి కరవేనని, రైతులకు నష్టమేముందని చులకన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 466 పైగా మండలాల్లో పొడివాతావరణం నెలకొన్నా, ఎండిన పంటలు, బీళ్లుపడిన పొలాలు కన్పిస్తున్నా, 103 కరవు మండలాలతో సరిపెట్టారు. పెట్టుబడి రాయితీని 847 కోట్ల రూపాయలకు పరిమితం చేశారు.
వాస్తవానికి ఆగస్టులోనే ముందస్తు కరవు ప్రకటించి, విత్తనం వేయని రైతులకు కూడా పెట్టుబడి రాయితీ, పంటల బీమా ఇప్పించే అవకాశం ఉన్నా విస్మరించారు. నేటికీ అదే కరవు వెంటాడుతోంది. అక్టోబరులో సాధారణం కన్నా 90శాతం తక్కువ వానలు కురిశాయి. రెండోదఫా కరవు మండలాల్ని ప్రకటించాలనే ఆలోచన కూడా చేయలేదు.
కరవు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ఆర్థిక సాయంపై హామీ
ఇలా ఈ ఏడాది తుపాను, కరవు వల్ల మొత్తంగా, సుమారు 43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. జగన్ సర్కారు మాత్రం 21లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందని తెల్చింది. 12వందల 89 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీతో సరిపెట్టేందుకు సిద్ధమైంది. అంటే ఎకరాకు రైతుకు దక్కేది సగటున 6వేల175 రూపాయలే. ఈ ఏడాది ఒక్కో రైతు తక్కువలో తక్కువ 50వేల రూపాయల నుంచి లక్షల్లో నష్టపోయారు. అలాంటి రైతులకు ఎకరాకు 15వేల రూపాయల పరిహారం ఇస్తే మునిగిపోయేదేముంది.
లక్షల రూపాయల పెట్టుబడి అని జగన్ ఎలా తెలుసు: చిన్న, సన్నకారు రైతులు పెట్టే పెట్టుబడిలో 80శాతం మొత్తాన్ని రైతు భరోసా రూపంలో ఇస్తున్నామని జగన్ ఊదరగొడతారు. అసలు ఆయనకు ఎకరా సాగుకు ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసా. పప్పుధాన్యాల సాగుకు ఎకరాకయ్యే ఖర్చు 25వేలపైనే. వరికి కనీసం 42వేలు, పండ్లతోటలకైతే ఎకరాకు 50వేల నుంచి లక్షన్నల వరకూ ఖర్చు వస్తుంది. సీఎం జగన్ బుర్రకు ఇది ఎలా ఎక్కుతుంది. కనీసం 15వేల రూపాయలైనా పరిహారం ఇవ్వకపోతే రైతుకు జరిగిన నష్టం ఎలా భర్తీ అవుతుంది.
కేెంద్ర కరవు బృందాన్ని అడ్డుకున్న రైతులు - తడిసిన పంటల ఫొటో ప్రదర్శన