నవ్యాంధ్రలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా.. గుంటూరు జిల్లాలో రెండ్రోజుల పాటు ప్రభుత్వం..కొండవీడుకోట ఉత్సవాలు ఏర్పాటు చేసింది. వినోద, సాంస్కృతిక సంబరాలను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాజకుమారి ప్రారంభించారు. కొండవీడు కోటపై ఆనాటి చెరువులను పరిశీలించారు. ఇవాళ జరిగే రెండోరోజు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.
ఉత్సవాల్లో భాగంగా వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. హెలీకాప్టర్ రైడ్, పారా మోటరింగ్, గుర్రాలపై స్వారీ వంటి వినోద కార్యక్రమాలు చిన్నాపెద్దా అందర్నీ అలరించాయి.
కొండవీడుకోటను ప్రపంచ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు.
ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. సినీగాయకులు దీపు, ధనుంజయ్, దామిని... హుషారెత్తించే సినీగీతాలతో అలరించారు. ఘంటసాల పవన్ బృందం ప్రదర్శించిన నృత్యరూపకం ఆహుతులను కట్టిపడేసింది.