గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ కళాశాలలో జూనియర్, సీనియర్ల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన సీనియర్ విద్యార్థి ప్రియతం తెలిపిన వివరాల ప్రకారం సత్తెనపల్లిలోని కళాశాలలో చదువుతున్న జూనియర్ విద్యార్థి కార్తీక్ తో శుక్రవారం తనకు గొడవ జరిగిందని తెలిపారు. అయితే మధ్యవర్తుల చొరవతో గొడవ సద్దుమణిగిందని వివరించాడు. ఆదివారం మిడ్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో తన తమ్ముడితో కారులో కళాశాలకు రాగా తమపై కార్తీక్.. తన సహచరులతో మరోమారు వివాదానికి దిగాడని ప్రియతం వెల్లడించాడు. తాము తగ్గినప్పటికీ ఇద్దరిపై కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడికి దిగారన్నారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు కారులో బయలుదేరగా.. కార్తీక్ తన అనుచరులతో ద్విచక్ర వాహనాలను అడ్డుపెట్టి.. కత్తితో దాడి చేసినట్లు ప్రియతం పేర్కొన్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి పిర్యాదు చేశానని.. పోలీసుల ఆదేశం మేరకు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరానని తెలిపాడు. దాడి చేసిన వారిలో కార్తీక్ ఒక్కడే కళాశాల జూనియర్ విద్యార్థి అని.. మిగిలినవాళ్ళు బయట వ్యక్తులని ప్రియతం ఆరోపించాడు. ఘటనలో 8 మందికి గాయాలై సత్తెనపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు.