Gorantla Buchibabu arrested in Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో ఇద్దరు అరెస్టయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును దిల్లీలో సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా నిన్న బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుచ్చిబాబుకు సీబీఐ తెలిపింది. అనంతరం బుచ్చిబాబు అరెస్టును అధికారికంగా వెల్లడించింది. వైద్య పరీక్షల తర్వాత బుచ్చిబాబును కోర్టులో హాజరుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
అదే విధంగా మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మల్హోత్రాను సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇవీ చదవండి: