Chandrababu Open Letter to AP People: తెలుగుదేశం పార్టీ చిహ్నమైన సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీక అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ పై రేపటి నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు 3 కోట్ల మందిని కలిసే కార్యక్రమంలో ప్రజల సహకారం, భాగస్వామ్యం కోరారు.
2014-19 మధ్య రెండంకెల వృద్ధితో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను నేటి పాలకులు నాలుగున్నరేళ్లలో సర్వ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. భస్మాసుర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని.. మహిళా సాధికారత, భద్రత అటకెక్కిందని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో పెట్టుబడుల మాటే లేదని.. నిరుద్యోగం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Babu Surety Bhavishyathuku Guarantee Program: బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ దోపిడీతో పేదలు.. మరింత పేదలు అయ్యారని, సహజ వనరులను, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను దోచేస్తూ సైకో ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. వైసీపీ మాఫియా రాజ్యంలో భావితరాల భవిష్యత్తు నాశనం అయ్యిందని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకే "భవిష్యత్తుకు గ్యారెంటీ" పేరుతో పథకాలను ప్రకటించామని వెల్లడించారు.
సెప్టెంబరు 1 నుంచి 45 రోజుల పాటు "బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రజల ఆర్థిక పరిపుష్టి, రక్షణ, భవిష్యత్తు కోసం రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల ఉద్దేశ్యాలను, వాటి వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తారన్నారు. ప్రజలు వారి సమస్యలపై వారితో చర్చించాలని.. వారిని ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో కలిసి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
CBN in Mahashakthi: నాలుగేళ్లుగా ఉన్మాది పాలన.. ఆడబిడ్డలకు రక్షణ లేదు: చంద్రబాబు
TDP Mahashakthi Program: మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళా సాధికారత చేకూర్చడం, తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆడబిడ్డ నిధి ద్వారా 18 పైబడి 60 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరల భారం తగ్గించడానికి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని.. అవసరమైయితే నాలుగో సిలిండర్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి 20 వేల ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టం చేశారు. యువగళం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఆర్థిక సహాయం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తేల్చిచెప్పారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కుళాయి కల్పిస్తామన్నారు.
TDP Manifesto: 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. వివరాలివే..
TDP Mini Manifesto: పేదరికాన్ని రూపుమాపేందుకు పీ4 విధానం ద్వారా పూర్ టు రిచ్ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. పథకాల కింద ప్రతి కుటుంబానికి ఎంత ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజలతో చర్చించనున్నట్లు తెలిపారు. ఆ వివరాలన్నింటినీ ఒక కార్డు పైన నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తారన్నారు. ఆయా పథకాల అమలుకు సంబంధించి చంద్రబాబు సంతకంతో కూడిన హామీ పత్రాన్ని ప్రజలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజల జీవితాలకు, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసే తొలి అడుగు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.
TDP Manifesto: వచ్చే 45 రోజుల్లో మూడు కోట్ల మందిని కలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కుటుంబాల వారీగా సంక్షేమ పథకాల కింద కలిగే ఆర్థిక ప్రయోజనాలను లబ్ధిదారులతో సంప్రదించి వాస్తవికంగా పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఇదే మొదటిసారని చెప్పారు. దసరా పర్వదినం నాడు సమగ్ర మేనిఫెస్టో ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అందరి భాగస్వామ్యం, మద్దతు, సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Maha Shakthi Scheme: ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ కీలక ముందడుగు.. మహిళా సాధికారతకు "మహాశక్తి"