Chandrababu Is Visit To Guntur District: అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత బీసీలు గుర్తుకొచ్చారా..? జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశించగానే టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు అపూర్వ స్వాగతం పలికాయి. బుడంపాడు వద్ద చంద్రబాబును గజమాలతో ఘనంగా సత్కరించగా..అక్కడి నుంచి బైక్ ర్యాలీతో చంద్రబాబు పర్యటన సాగింది. సంక్షేమ పథకాలు తీసివేస్తామని బెదిరించి సభకు జనాన్ని తరలించారని నారాకోడూరు సభలో చంద్రబాబు నిప్పులు చెరిగారు.
వైసీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయి, తలసరి ఆదాయం తగ్గిపోయి, అప్పులు, పన్నులు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. సంగం, విజయ డెయిరీలు ఉండగా..గుజరాత్‌ను నుంచి అమూల్ సంస్థను తీసుకురావాల్సిన అవసరమేంటని నిలదీశారు. పొన్నూరులో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని రెచ్చగొట్టే చర్యలకు దిగారు. వైసీపీ శ్రేణులపైకి టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున దూసుకెళ్లటంతో పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ శ్రేణుల్ని అక్కడి నుంచి పంపించేశారు. మూడు రాజధానుల పేరిట కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అసమర్ధ పాలనతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
వైసీపీపై తిరుగుబాటు పొన్నూరు నుంచే మొదలవుతుందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు. ఒక్క అవకాశం అడిగిన వైసీపీ సినిమా అయిపోయిందని వ్యాఖ్యానించారు. నేడు పొన్నూరులో మైనార్టీలకు ఇదేమీ ఖర్మ పేరిట ముస్లిం సోదరులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బాపట్ల పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.
ఇవీ చదవండి: